మరిన్ని కొత్త సొసైటీలు
● జిల్లాలో 29 పీఏసీఎస్‌లు ఏర్పడే అవకాశం ● మరింత బలోపేతం కానున్న సహకార సంఘాలు
రామాయంపేట(మెదక్): సహకార సంఘాల (సొసైటీలు) బలోపేతం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు ప్రతి మండలంలో కనీసం రెండు సంఘాలు ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెలలో ము గుస్తుండగా, కొత్తగా మరో 29 సంఘాల ఏర్పాటు కోసం జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ప్రతీ మండలంలో కనీసం రెండు..
జిల్లాలోని 21 మండలాల్లో ప్రస్తుతం 37 సహకార సంఘాలుండగా, వాటిలో 50 వేలకుపైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా జిల్లా పరిధిలో మరో 29 సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్క సొసైటీ కూడా లేని మనోహరాబాద్, మాసాయిపేట మండలాల్లో రెండు చొప్పున ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాల్లో ఒక్కో సొసైటీ మాత్రమే ఉండగా, ఈ మండలాల్లో అదనంగా మరొకటి చొప్పున ఏర్పడనున్నాయి. జిల్లాలో గరిష్టంగా కొల్చారం మండలంలో రాంపూర్, కిష్టాపూర్, రంగంపేట, చిన్నఘన్‌పూర్, వరిగుంతం, కొల్చారం, కొంగోడ్, హంసాన్‌పల్లిలో సహకార సంఘాలున్నాయి. రంగంపేట సొసైటీ పరిధిలో అత్యధికంగా రంగంపేట, సంగాయిపేట, పైతర, ఎనగండ్ల, వై. మాందాపూర్, కోనాపూర్ తూక్కాపూర్ గ్రామాలుండగా వాటిని పునర్విభజించనున్నారు.
సంఘాల బలోపేతంపై దృష్టి
రైతులకు సొసైటీల ద్వారా కేవలం పంట రుణాలివ్వడానికే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవడంతో పాటు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కల్పించడం, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా ఆదాయం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
రైతులకు ఎంతో లాభం
సహకార సంఘాలతో రైతులకు ఎంతో లాభం ఉంది. రైతులకు సంబంధించి పూర్తిస్థాయిలో సదుపాయాలు సొసైటీల నుంచే కల్పించే అవకాశం ఉంది. రుణాలు అందజేయడంతో పాటు ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు తదితర సదుపాయాలు కలుగుతాయి. ప్రస్తుతం సొసైటీల పెంపు ఎంతో అవసరం.
– బాదె చంద్రం, రామాయంపేట సొసైటీ చైర్మన్
ప్రతిపాదనలు పంపాం
జిల్లా పరిధిలో ప్రస్తుతం 37 సహకార సంఘాలుండగా, కొత్తగా మరో 29 సొసైటీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాం. ఎన్ని కొత్త సహకార సంఘాలు ఏర్పాటవుతాయనే విషయమై ఇప్పుడే చెప్పలేం. ప్రతి మండలంలో కనీసం రెండు చొప్పున సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
– కరుణాకర్, జిల్లా సహకార అధికారి
Comments
Please login to add a commentAdd a comment