సాగుకు ‘భరోసా’!
మెదక్‌జోన్: ఎట్టకేలకు ప్రభుత్వం రైతుకు భరోసా ఇచ్చింది. ఈనెల 26 నుంచి ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించింది. భూమిలేని నిరుపేదలకు ఏటా రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. త్వరలోనే ఈ కుటుంబాలను నిర్ధారించనున్నట్లు తెలిసింది. అయితే కౌలు రైతులకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించలేదు. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల పైచిలుకు ఎకరాల సాగు భూములు ఉండగా, అందులో ఏటా నాలుగు లక్షల ఎకరాల వరకు సాగవుతున్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు ఏటా రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ గతేడాది 2024 జనవరిలో గత ప్రభుత్వం మాదిరిగానే ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందజేసింది. వానాకాలం సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో రైతులు నిరాశ చెందారు.
కౌలు రైతుల ఊసెత్తని సర్కార్
సాగు భూములకు రైతు భరోసా, భూమి లేని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు.. కౌలు రైతులకు మాత్రం నిరా శ మిగిల్చింది. జిల్లాలో 30 వేల పైచిలుకు రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరు అరఎకరం, ఎకరం ఉన్న పేదలు. ఇతరుల భూములు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
ఎట్టకేలకు యాసంగికి పెట్టుబడి సాయం
జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో
సాగు అంచనా
నేటి నుంచి పంటల ఆన్‌లైన్
జిల్లాలో యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందులో 20 వేల ఎకరాల్లో కూరగాయలతో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. మిగితా 2.60 లక్షల ఎకరాల్లో ఎప్పటిలాగే వరి సాగు చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో సాగు పూర్తి చేశారు. వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సోమవారం నుంచి అధికారులు పంటల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. దీని ఆధారంగానే రైతు భరోసా, పంటలు దెబ్బతింటే పరిహారం అందుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే వానాకాలం నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు పంటలు సాగయ్యాయి. యాసంగిలో అందులో సగం మేరకు మాత్రమే పంటలు సాగు కానున్నాయి. ప్రభుత్వం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడంతో యాసంగిలో రైతు భరోసా తగ్గనుంది.
ప్రభుత్వం మాట మార్చడం సరికాదు
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అలాగే కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పి, నేడు వారి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే 2024 వానాకాలం పెట్టుబడి సైతం ఇవ్వలేదు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. – ప్రభాకర్, రైతు, మెదక్
Comments
Please login to add a commentAdd a comment