ఎట్టకేలకు కొత్త కారు్డలు
మెదక్ కలెక్టరేట్: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డులతోనే ముడిపడి ఉండడంతో చాలా మంది సబ్సిడీ పథకాలకు దూరమయ్యారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్న నేపథ్యంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 493 గ్రామ పంచాయతీలు ఉండగా.. సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని వారిని గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. జిల్లాలో మొత్తం 11,515 మంది కొత్త రేషన్‌కార్డులకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే జాబితాలో పేరులేని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. అధికారులు మాత్రం సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన వ్యక్తుల ఆధార్ నంబర్‌ను సరిపోల్చుకుని అర్హులను గుర్తిస్తామని చెబుతున్నారు. కుటుంబాల విభజనతో కొత్త కార్డులు కావాలని దరఖాస్తు చేసిన వారి వివరాలను తాజా సర్వే తర్వాత పాత కార్డుల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. కొత్తవారే కాకుండా, మార్పులు, చేర్పుల కోసం కొన్నేళ్లుగా వేలాది మంది ఎదురు చూస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా..
కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ ప్రాంతంలో నివసించే వారి వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలైతే రూ.1.50 లక్షల వరకు ఉండాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి చెప్పారు. మాగాణి 3.50 ఎకరాలు లేదా మెట్ట 7.50 ఎకరాలు మించకూడదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హులను గుర్తిస్తామని, అభ్యంతరాలు సైతం స్వీకరించి పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యతో డూప్లికేషన్ తొలగిస్తామని, ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో కొనసాగుతుందని వివరించారు.
కులగణన ఆధారంగా మంజూరు
జిల్లాలో 11,515 కుటుంబాల గుర్తింపు
కొనసాగుతున్న అర్హుల ఎంపిక సర్వే
Comments
Please login to add a commentAdd a comment