పూత.. దిగుబడిపై ఆశ
ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి పూత విరగబూసింది. అయితే వివిధ రకాలు తెగుళ్లు రైతులను కలవరపెడుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి తోటల పెంపకం చేపట్టిన కర్షకులు తెగుళ్ల భారి నుంచి చెట్లను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం వివిధ రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. పూత నిలబడితేనే దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నారు.
విరగబూసిన మామిడి
● తెగుళ్ల ముప్పుతో రైతుల దిగులు
● అప్రమత్తత అవసరమనిఅధికారుల సూచన
● జిల్లాలో 3వేల పైచిలుకు ఎకరాల్లో తోటలు
మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా మూడు వేల పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వాతావరణ మార్పులతో పాటు అకాల వర్షాలు, గాలివానతో గడిచిన మూడేళ్లు రైతులు నష్టాలనే చవి చూశారు. కాగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా మామిడి పూత విరగబూసింది. కానీ రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవ డం, రసం పీల్చే పురుగుతో పాటు బూడిద తెగులు రైతులను కలవరపెడుతున్నాయి. దీంతో పూత, కాత రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల నివారణ కోసం వారికి తోచిన మందులను పిచికారీ చేస్తున్నారు. వారం రోజుల్లో తెగుళ్ల నుంచి తోటలను కాపాడుకోకుంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరి ఇతర కూరగాయల మాదిరిగా కాకుండా మామిడి పూత పలు దఫాలుగా వస్తోంది. ఇది ముఖ్యంగా డిసెంబర్ మూడో వారం నుంచి మొదలుకుని ఫిబ్రవరి మూడో వారం వరకు పలుమార్లు రానుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలుకుని జూన్ చివరి వారం వరకు కాత వస్తుంది. అంటే ఏడాదిలో ఐదు మాసాల వరకు మామిడి పంట ప క్రియ కొనసాగుతోంది. కాగా జనవరి, ఫిబ్రవరిలో సోకే తెగుళ్ల నివారణ కోసం సకాలంలో చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎకరాకు రూ. లక్ష ఆదాయం
తెగుళ్ల ముప్పు నుంచి మామిడి తోటలను కాపాడుకుంటే ఎకరాకు రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎకరంలో మూడు నుంచి నాలుగు టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుందంటున్నారు. టన్ను మామిడి కాయలకు హోల్‌సేల్ ధర రూ. 25 వేల వరకు ఉంటుందని, ఈ లెక్కన ఎకరంలో సదరు రైతు ఆదాయం రూ. లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది. టంకర చేసే మరింత అదాయం రానుంది. మామిడి కాయలను కోసం మగ్గబెట్టి విక్రయిస్తే ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం వస్తే, మామిడి కాయలను కోసి టంకరగా మార్చి విక్రయిస్తే ఎకరానికి రూ. 2 లక్షల మేర ఆదాయం వరకు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎక్కువగా మెదక్, కొల్చారం, చిన్నశంకరంపేట, రామాయంపేట, హవేళిఘణాపూర్ తదితర మండలాల రైతులు మాత్రమే టంకరను తయారు చేస్తారు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం మామిడి తోటలు విరగబూశాయి. అయితే తోటలకు రసం పీల్చే పురుగు, బూడిద తెగులు ఆశించింది. ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెగుళ్ల నివారణ కోసం 20 లీటర్ల నీటిలో ఒక గ్రాము ఇమిడక్లోరైడ్, రెండు గ్రాముల సాఫ్‌తో పాటు 19–19–19ను 5 గ్రాముల చొప్పున నీటిలో కలిపి పూతపై 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
– ప్రతాప్‌సింగ్,
జిల్లా ఉద్యానశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment