అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మండలంలోని సిందోల్‌లో గురువారం జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలకతీతంగా అర్హులను పథకాలకు ఎంపిక చేయాలని సూచించారని చెప్పారు. ఏదైనా కారణంతో అర్హత ఉండి జాబితాలో పేర్లు రాకపోతే గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా పథకంలో సాగుకు యోగ్యం కానీ భూములను తొలగించామని, సాగు భూములకే రైతు భరోసా వర్తింపచేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మూడు దఫాలుగా జాబితాలు తయారు చేశామన్నారు. మొదటి విడతలో ఇళ్ల స్థలాలు ఉండి అర్హత ఉన్న వారికి, రెండో జాబితాలో ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, రుణమాఫీ చేసిందన్నారు. రూ. రెండు లక్షల పైన ఉన్న రుణాలు దశలవారీగా మాఫీ అవుతాయని వివరించారు. అనంతరం మర్పల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి నూతన భవనంలోకి మార్చాలంటూ అధికారులను ఆదేశించారు. అనంతరం అల్లాదుర్గంకు మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, ఐటీఐ, ఫైర్‌స్టేషన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు భవన నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. నీటి సౌకర్యం, రవాణాపై తహసీల్దార్ మల్లయ్యను అడిగి తెలుసున్నారు. గ్రామానికి దగ్గరలో ప్రభుత్వం స్థలం ఉందా అని ఆరా తీశారు. కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment