అర్హులమైనా ఎంపిక చేయరా?
కొల్చారం(నర్సాపూర్): ఇల్లు ఉన్న వారికే కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంపై మండలంలోని కిష్టాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో గురువారం ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. గ్రామసభ ప్రారంభం కాగానే తహసీల్దార్ గఫార్‌మియా గ్రామంలో ఇళ్ల మంజూరుకు సంబంధించిన పేర్లను చదువుతున్న క్రమంలో ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి పేర్లే జాబితాలో ఉండడం, గుడిసెల్లో ఉంటున్న తమ పేర్లు ఎందుకు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మమత అవినీతికి పాల్పడిందని, ఆమెను వెంటనే గ్రామం నుంచి పంపి వేయాలంటూ అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అదనపు కలెక్టర్ నగేష్ జోక్యం చేసుకొని జాబితాలో పేర్లు లేనివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, తిరిగి సర్వే జరిపి అర్హులకే పథకాలు వర్తింపజేస్తామని ప్రజలకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు శాంతించలేదు. పంచాయతీ కార్యదర్శిని చుట్టుముట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదావరి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆగ్రహం
పంచాయతీ కార్యదర్శినిచుట్టుముట్టిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment