ఆ దరఖాస్తులు ఎటుపోయాయి?
నాగ్సాన్‌పల్లి గ్రామసభలో
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్/కౌడిపల్లి: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయకుండా కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏమిటని, ప్రజాపాలన దరఖాస్తులు ఎటుపోయాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ప్రశ్నించారు. గురువారం మండలంలోని నాగ్సాన్‌పల్లి గ్రామసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారులు జాబితా చదవడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు రేషన్‌కార్డులు మంజూరు కాలేదని గ్రామస్తులు చెప్పారు. గ్రామసభకు ప్రత్యేక అధికారి, ఐబీ ఏఈ రవిమోహన్ గంట ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టు కాలువకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నర్సాపూర్‌లో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సభలలో ప్రజలు అధికారులను తిడుతున్నారని, పథకాలు తమకెందుకు మంజూరు చేయలేదని నిలదీస్తున్నారని తెలిపారు. జాబితాలో పేర్లు లేని వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేయాలనడం విచారకరమని అన్నారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని మాట మార్చారన్నారు. ఆత్మీయ భరోసా పథకంలో అనర్హుల పేర్లు ఉన్నాయని, వాటిని సరి చేసి అర్హులకు అందజేయాలని డిమాండు చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలు సరిగా లేవన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు సత్యంగౌడ్, యాదాగౌడ్, సూరారం నర్సింలు, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment