‘‘హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘దిల్’ సినిమా ప్రీమియర్‌కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్‌గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్ బ్లోయింగ్‌గా నచ్చింది. ‘ఇడియట్’ మూవీ చూసి ఇలాంటి యూత్ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్‌గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు.
ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్‌గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్‌గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్), నాతో మాట్లాడి.. సుకుమార్ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్ షూట్ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్‌గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. ఇందుకు సుకుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టాప్ ΄÷జిషన్‌లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఉండటం అనేది గ్రేట్ మూమెంట్.. దీనికి కారణం సుకుమార్. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment