బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. నటుడిగానే కాకుండా గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా సత్తాచాటుతున్నారు. కథానాయకుడిగా హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నారు. ఈయన తాజా చిత్రం వార్నీ (తెలుగులో సార్) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా తమిళంలో నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ధనుష్ కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన తన 50వ చిత్రానికి సిద్ధమయ్యారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే దీన్ని నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈయన చాలా కాలం క్రితమే పవర్ పాండి అనే చిత్రంతో మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన 50 చిత్రానికి మెగా ఫోన్ పట్టనున్నారన్న మాట. ఇకపోతే ఇందులో కథానాయికగా నటించే లక్కీచాన్స్ ఓ యువ నటిని వరించినట్లు సమాచారం. ఇంతకుముందు పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్ట పరంపరై చిత్రంలో ఆర్యతో జత కట్టిన నటి దుషార విజయన్, ఇటీవల నక్షత్రం నగర్గిరదు చిత్రంలోనూ నటించింది. ఈ భామకే ఇప్పుడు ధనుష్ సరసన నటించే అదృష్టం వరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment