అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

Published Mon, Jan 6 2025 7:42 AM | Last Updated on Mon, Jan 6 2025 7:42 AM

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

గీసుకొండ: బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ 15వ డివిజన్‌ పరిధిలోని మొగిలిచర్ల, గొర్రెకుంట(గరీబ్‌నగర్‌), విశ్వనాథపురం గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మొగిలిచర్లలో ఏర్పాటు చేసి బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏడాది క్రితం ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీలను నెరవేర్చిందని పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి యువ ఎమ్మెల్యేగా ఉత్సాహంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు కరెంట్‌ కష్టాలు తీరి భవిష్యత్‌లో నాణ్యమైన విద్యుత్‌ అందుతుందన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కోరిన నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్కంపేట రెవెన్యూ గెజిట్‌ను గ్రామస్తులకు అందజేశారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరయ్యాయని, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మించుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి దామెర, సంగెం యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరకాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సుమారు రూ.50 కోట్ల అంచనాతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రూ.వంద కోట్లతో రహదారులు, రూ.160 కోట్లతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మినీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలను, డెయిరీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీయూఎఫ్‌ ఐడీసీ కింద రూ.19 కోట్లు, సీవరేజ్‌ వాటర్‌ డ్రైన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్‌.నాగరాజు, మురళీనాయక్‌, ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్‌ సత్య శారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మూడు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన

అక్కంపేట గ్రామస్తులకు

రెవెన్యూ గెజిట్‌ అందజేత

మొగిలిచర్లలో బహిరంగ సభ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement