కమలం x హస్తం
ములుగు: జిల్లా కేంద్రంలో కమలం, హస్తం పార్టీ నాయకుల మధ్య బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మాజీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, భూక్య జవహర్‌ల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటల సమయంలో మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలు దేరారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్‌రావు బండారుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో నాయకులంతా జాతీయరహదారిపైకి చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో ప్రధాన నాయకులు వెనుదిరిగారు. అక్కడే ఉన్న కొంతమంది ఏరియా ఆస్పత్రి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ఫ్లెక్సీలను చించారు. గమనించిన కానిస్టేబుల్ మహేశ్ వారిని అడ్డుకున్నారు.
చించిన ఫ్లెక్సీలను చూసి కోపంతో..
ఈ విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ నాయకులతో కలిసి రోడ్డుపైకి చేరుకున్నారు. సంఘటన స్థలంలో చింపి ఉన్న మంత్రి సీతక్క ఫ్లెక్సీలను చూసి కోపోద్రికుడైన బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ సదరు బీజేవైఎం నాయకుడి బుక్‌స్టాల్‌పైకి వెళ్లాడు. అప్పటికే షాపు మూసి ఉండడంతో బయటి కొక్కాలకు తగిలించి ఉన్న బ్యాగ్‌లను విసిరిపారేశాడు. ఈ క్రమంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడి షాపునకు వెళ్తున్న క్రమంలో సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు కలెక్టరేట్‌కు వెళ్లే జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. డీఎస్పీ రవీందర్ నాయకులతో మాట్లాడుతున్న క్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అక్కడికి చేరుకొని చించిన ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు తిరిగి కొత్తగా పెడితే ఊరుకుంటామని తెలిపారు. మోదీ డౌన్ డౌన్.. అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కలగజేసుకుని సముదాయించారు. అనంతరం కాలినడకన పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేయగా ఏడుగురిపై కేసు నమోదు అయినట్లు సమాచారం.
బీజేపీ నాయకుల గుండాగిరి..
అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ నాయకుల గుండాగురి కొనసాగుతుందన్నారు. మహిళా మంత్రి ఫ్లెక్సీలను చింపి యావత్ మహిళా లోకానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. వెంటనే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులను బీజేపీ సస్పెండ్ చేయాలని సూచించారు. గతంలో శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు జరిగాయి తప్పా ఇంతటి విచక్షణా రహిత చర్యలను చూడలేదన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్‌పాషా, బండి శ్రీను, భరత్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ నాయకుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. ఎన్‌హెచ్‌పై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఏరియా ఆస్పత్రి ఎదుట
మంత్రి సీతక్క ఫ్లెక్సీల చించివేత
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన
కాంగ్రెస్ నాయకులు
ఏడుగురు బీజేపీ నాయకులపై
కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment