కలల ప్రయాణం
కాల
గమనం
పండుగంటే ఆనందాల్ని మూటగట్టుకోవడం.. సంతోషాల్ని నెమరువేసుకోవడం.. సంప్రదాయాల్ని కాపాడడం.. సంస్కృతిని ముందుతరాలకు అందించడం..
●
కాలగమనంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు మారుతుంటాడు. అలా మారుతున్నదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణమంటే కదలిక అని అర్థం. ఆ మాదిరిగా ప్రతీ మనిషి తన ఆలోచన, నడవడిక, వైఖరిలో సంక్రమించాలి. ఎప్పటికప్పుడు మార్పు చెందాలి. ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆప్యాయత, అభిరుచి, ఆనందాల కలబోతతో జరుపుకునే సంక్రాంతి నేర్పే పాఠమిదే.
– హన్మకొండ కల్చరల్
ఆధ్యాత్మికం..
కాస్తంత పని చేస్తేనే అలసిపోతారు. విశ్రాంతి తీసుకుంటారు. మరి నిత్యం లక్షల ఆలోచనలు చేసే మనసుకెక్కడుంది విశ్రాంతి. మనసు ఆహ్లాదంగా మారాలంటే.. ఆధ్యాత్మికతతో నిండాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కుటుంబంతో కలిసి దేవాలయాలను సందర్శించడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల ఆధ్యాత్మికత అలవడుతుంది. ఆలయాల్ని సందర్శించడం ద్వారా మనసుకు కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ అందుతుంది. దేవాలయాల్లో వినిపించే ప్రవచనాలు, మంత్రాలు, సంగీతం మనసును తేలికపరుస్తాయి.
ఆరోగ్యం..
షడ్రుచులతో భోజనం చేస్తే పొట్టకు పండగే. అలాగని బయట దొరికే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మార్కెట్లో కల్తీ పెరిగిన నేపథ్యంలో ఇంటి వంటలకు పరిమితమైతేనే మంచిది. ఇంట్లో చేసే పిండి వంటల్లో ఆరోగ్య సూత్రాలు ఎన్నో దాగున్నాయి. నువ్వులతో చేసిన పిండి వంటలు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అరిసెలు అనారోగ్యాన్ని దూరం చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఇలా ప్రతీ వంటకం ఆరోగ్యాన్ని కలుగజేసేదే.
అనుబంధం
ఉపాధి కోసం ఊరు విడిచి వెళ్లిన వారంతా పండుగ నేపథ్యంలో ఇళ్లకు చేరుతుంటారు. ఈసమయంలో అందరూ కలిసి కష్టసుఖాలు పంచుకుంటే పండుగ కలకాలం గుర్తుండిపోతుంది. అందరూ ఒక చోట చేరిన సమయంలో ఫోన్లను దూరం పెడితే మంచిది. ఉమ్మడిగా భోజనాలు చేయడం.. సామూహికంగా పూజలు చేయడం వల్ల ఆప్యాయతలు పెరుగుతాయి. అంత్యాక్షరి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం వల్ల మళ్లీ పండుగ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తారు.
మమేకం..
ఈ సృష్టిలో ప్రతీ జీవిలో కదలిక ఉంటుంది. దాన్ని సైంటిస్ట్‌లు తరంగాలు అన్నారు. ఎక్కడో ఉన్న వ్యక్తి వీడియో కాల్‌లో ఇక్కడ కనిపించడమేంటి? అదే మాదిరిగా.. ప్రతీ జీవీ మనిషికి ఏదో సమయంలో ఏదో విధంగా సాయపడుతూనే ఉంటుంది. మనుషులు ఆహారాన్ని సంపాదించడానికి పరుగులు పెడతారు. రేపటి కోసం దాచుకుంటారు. మూగజీవా లు, పశుపక్ష్యాదులు మాత్రం అలా కాదు.. ఏరోజుకారోజు ఆహారాన్ని తెచ్చుకుంటాయి. వాటికి మనుషులతో విడదీయలేని బంధం. వాటిపై కృతజ్ఞత చూపాలి. వ్యవసాయంలో ఇతోదికంగా సహాయపడే పశువులను సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ రోజు పూజించడం ఆనవాయితీ అందుకే.
వ్యాయామం
ఈ మధ్య ఇన్‌స్టంట్ ముగ్గులూ వచ్చాయి. మహిళలకు శ్రమ లేకుండా మార్కెట్లో దొరికే ఫ్రేమ్‌లపై రంగు పోస్తే చాలు.. ముగ్గు రెడీ అవుతుంది. కానీ.. రోజూ ముగ్గు వేయడం వల్ల శరీరానికి తగిన వ్యాయామం దొరుకుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. వంగి లేవడం వల్ల శ్వాస తీసుకోవడం, వదలడం ఎక్కువ సార్లు చేస్తారు. దీంతో ప్రాణాయామం చేసినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment