నేడు హేమాచలుడి వరపూజ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో నేడు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వరపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయశాఖ హేమాచల క్షేత్రం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిఏటా పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారని ప్రధానార్చకులు కై ంకర్యం రాఘవాచార్యులు తెలిపారు. నేడు(మంగళవారం)మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హేమాచలక్షేత్రంలోని స్వయంభు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళవాయిద్యాల నడుమ మల్లూరు గ్రామానికి తీసుకుని వచ్చి వరపూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మే నెలలో హేమాచలక్షేత్రంలో 10రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణ మహోత్సవ సుమూహుర్త నిశ్చయ తాంబూలాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు రాత్రి 7 నుంచి 10.20 గంటల వరకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేద బ్రాహ్మణులు ప్రవరా వరపూజా మహోత్సవంకార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించనున్నారు. మే 12వ తేదీన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ సుముహూర్తం ఖరారు, నిశ్చయ తాంబూళాల స్వీకరణ కార్యక్రమాన్ని చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరా నుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివాసీల చీరసారె..
లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల వరపూజను పురస్కరించుకుని ఆదివాసీ గిరిజనులు ఆడబిడ్డగా ఆరాధించే చెంచులక్ష్మి అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు కుంకుమతో పాటు స్వామివారికి రాసగుమ్మడి కాయలను సారెగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామాన్ని పూర్వం చెంచుపల్లిగా పిలిచేవారు. ఆదివాసీ గిరిజన తెగకు చెందిన చెంచు నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే క్రమంలో ఈ ప్రాంతానికి వేటకోసం వచ్చిన లక్ష్మీనర్సింహస్వామి చెంచునాయకుడి కుమార్తెను గాంధర్వ వివాహం చేసుకున్నాడని ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. అప్పటి నుంచి ప్రతిఏటా సంక్రాంతి పండుగ రోజు నిర్వహించే స్వామివారి వరపూజా కార్యక్రమానికి ఆదివాసీ గిరిజనులు తరలివచ్చి చీరసారె, రాసగుమ్మడి సమర్పించి కానుకలు సమర్పిస్తుంటారు.
వివాహ నిశ్చయ తాంబూలాల స్వీకరణ
వేలాదిగా తరలిరానున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment