ఘనంగా భోగి
ములుగు/ఏటూరునాగారం: జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమ ఇళ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి నవధాన్యాలతో గొబ్బెమ్మలు పెట్టారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. అలాగే పలువురి ఇళ్లలో బొమ్మల కొలువులు నిర్వహించారు. మహిళలు పిండి వంటలను తయారు చేసి వారి ఇష్టదైవాలకు సమర్పించారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల సందడి నెలకొంది.
భోగి మంటల సందడి..
అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రజలు తమ ఇళ్లలోని పాత కర్రలు, ఇతర సామగ్రిని ఇంటి పరిసరాల్లో ఒకచోట పేర్చి భోగి మంటలు కాగి సందడిగా గడిపారు. ఏటూరునాగారంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు వేసి చుట్టూ నృత్యాలు చేస్తూ సంబురాలు నిర్వహించారు. పీఆర్‌ఆర్ యూనిటీ అండ్ చారిటీ ట్రస్ట్ నిర్వాహకులు మడుగూరి నాగేశ్వరరావు అధ్యక్షతన ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నేడు సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
నేడు సంక్రాంతి, రేపు కనుమ
Comments
Please login to add a commentAdd a comment