● బతుకమ్మకు ఇక్కడ.. సంక్రాంతికి అక్కడ
● కోడి పందేలకోసం యువత ప్రయాణం
● ఉమ్మడి వరంగల్ నుంచి వేలాదిగా..
● ఈసారి ఏపీ పందేలకు వరంగల్ కోళ్లు
మహబూబాబాద్, సాక్షి: ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, వ్యాపారంలో కలిసి పనిచేయడం, హైదరాబాద్ వంటి నగరాల్లో కలిసి మెలిసి ఉండడం పరిపాటి. అయితే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు, బంధుత్వాలు మ రింత బలపడుతున్నాయి. ఏపీలోని బంధువులను బతుకమ్మ పండుగకు తెలంగాణకు ఆహ్వానించడం.. తెలంగాణలోని బంధువులను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన వెంటనే జిల్లా నుంచి ఏపీకి బంధువులు, స్నేహితుల ఇళ్లకు పయనమవుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, నర్సంపేట, వెంకటాపురం, ములుగు, వరంగల్, హనుమకొండ, పర్వతగిరి, జనగామ, తొర్రూరు, మహబూబాబాద్, డోర్నకల్, కురవి, మరిపెడ, కేసముద్రం, గూడూరు, గార్ల, బయ్యారం ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటోంది.
బరిగీసి.. పందెమాడేందుకు..
మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీలో నిర్వహించే కోడి పందేలు, ఇతర వేడుకల్లో పాల్గొనడం, ఆయా కార్యక్రమాలను తిలకించేందు కు యువతతోపాటు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు ఏపీకి వెళ్తున్నారు. ఇందులో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు వెళ్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దులోని జంగారెడ్డిగూడెం, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేటతో పాటు భీమవరం, ఏలూరు, పాలకొల్లు, నూజివీడు ప్రాంతాలకు ఇప్పటికే పలువురు చేరారు. అక్కడ కోడి పందేలు రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు చేరుతున్నాయి. రాజుల పందేలు అయితే బరికి రూ.10లక్షల వరకు వెళ్తోంది. అయితే ఈ ఏడాది ఆంధ్రాలోని కోడి పందేలకు తెలంగాణ నుంచి కూడా పందెం కోళ్లను తీసుకెళ్లడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment