మెరిసిన ఆత్మకూర్‌ ఆణిముత్యం | Sakshi
Sakshi News home page

మెరిసిన ఆత్మకూర్‌ ఆణిముత్యం

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

సివిల్స్‌లో 278 ర్యాంకుసాధించిన ఎహ్తేదా ముఫస్సీర్‌

ఆత్మకూర్‌: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్‌కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్‌ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై ంది. ఆత్మకూర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు సయ్యద్‌ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్‌కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్‌, కుమారుడు సయ్యద్‌ తఫస్సూల్‌ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్‌ పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్‌ను సాధించిన ఆమె.. ఇంటర్‌ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్‌ ఇంట్లోనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్‌లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

తాతయ్యే స్ఫూర్తి..

‘మా తాతయ్య సయ్యద్‌ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్‌ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్‌ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు.

Advertisement
Advertisement