బిజినేపల్లి: మండల స్థాయి అధికారులంతా సమన్వయంతో ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికే అందేలా కచ్చితమైన జాబితా రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు తదితర వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామసభల ద్వారా అర్హుల జాబితాను ఏర్పాటు చేయాలన్నారు. గురువారం ఆయన మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామసభలో జాబితా ఆమోదం ద్వారా అర్హుల జాబితాను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.
● గోదాంలు, రైస్ మిల్లులు, మైనింగ్ సంబంధిత భూములు, పరిశ్రమలు, ఇళ్ల స్థలాలు, పంటలకు ఆమోదయోగ్యం కాని ఇతరత్రా భూములను గుర్తించి రైతు భరోసా పథకం నుంచి తొలగించాలని కలెక్టర్ అన్నారు. పాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్వే నం.275–ఆలో జీపీ ప్లాట్లను కలెక్టర్ ప్రత్యేకంగా గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికపై క్షేత్రస్థాయిలో తప్పక సందర్శించి అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. రోడ్లకు, గుట్టలకు, ఇతర నిర్మాణాలు జరిగిన భూములను రైతుభరోసాకు ఎంపిక చేయరాదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీఓ కథలప్ప, వ్యవసాయాధికారి నీతి, ఎంఈఓ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment