‘చేతి’కి చిక్కనున్న నీలగిరి | - | Sakshi
Sakshi News home page

‘చేతి’కి చిక్కనున్న నీలగిరి

Published Thu, Dec 21 2023 2:06 AM | Last Updated on Thu, Dec 21 2023 2:06 AM

బుర్రి శ్రీనివాస్‌రెడ్డి - Sakshi

బుర్రి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీ పగ్గాలు కాంగ్రెస్‌ పార్టీ చేతిలోకి రాబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో కొత్త కలెక్టర్‌ వచ్చాక అవిశ్వాస సమావేశం తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అవిశ్వాసం నెగ్గితే.. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న బుర్రి శ్రీనివాసరెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు. అప్పట్లో తృటిలో చైర్మన్‌ పీఠం తప్పిపోగా, ఇప్పుడు అవిశ్వాసంతో ఆ అవకాశాన్ని బుర్రి శ్రీనివాస్‌రెడ్డికే ఇచ్చే ఆలోచనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది.

బలం పెంచుకున్న కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ తమ బలాన్ని పెంచుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్‌కు 18 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో వారి సంఖ్య 17 అయింది. అదే సమయంలో 9 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్ల బలం 26కు పెరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల మరో నలుగురు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సంఖ్య 30కి చేరింది. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయనున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన పిల్లి రామరాజుయాదవ్‌ కూడా తమకు అనుకూలంగా ఓటు వేస్తారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు ఇంకొంత మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

మెజారిటీకి దగ్గరగా ఉన్నామనే ఆలోచనతోనే..

మున్సిపాలిటీలో అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీకి సరిపడా సంఖ్య ఉంటుందన్న ఆలోచనతోనే అవిశ్వాసాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు నాలుగు రోజుల కిందట కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాసం నెగ్గాలంటే సమావేశానికి 34 మంది (నాలుగింట మూడో వంతు) హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ సంఖ్యా బలం 33కు చేరుకోగా, పార్టీలో చేరబోయే ఒకరిద్దరు కౌన్సిలర్లను కలుపుకొని అవిశ్వాసం నెగ్గుతామని ఆ పార్టీ భావిస్తోంది.

‘బుర్రి’ వైపే మంత్రి మొగ్గు

నీలగిరి మున్సిపాలిటీపై పూర్తి అవగాహన ఉండి, కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డికే చైర్మన్‌ పీఠం దక్కుతుందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. శ్రీనివాస్‌రెడ్డి వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలిచారు. గతంలోనే ఆయనకు చైర్మన్‌గా అవకాశం వస్తుందని భావించినా తప్పిపోయింది. 2000, 2005లో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌ చైర్మన్‌ అయ్యారు. ఆ తరువాత 2014లో బొడ్డుపల్లి లక్ష్మి చైర్‌పర్సన్‌ అయ్యారు. ఆ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన శ్రీనివాస్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌ అయ్యారు. ఇక 2020 ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు పోటాపోటీగా సీట్లు వచ్చాయి. ఎక్స్‌ అఫీషియో ఓట్లతో బీఆర్‌ఎస్‌కు చెందిన మందడి సైదిరెడ్డి చైర్మన్‌ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండటం, బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ బలం పెరిగింది. 2020లోనే చైర్మన్‌గా అభ్యర్థిగా బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకే అవకాశం ఇస్తారన్న చర్చ సాగుతోంది.

ఫ బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి

మున్సిపల్‌ చైర్మన్‌ పగ్గాలు?

ఫ గత మున్సిపల్‌ ఎన్నికలప్పుడే ‘బుర్రి’ని చైర్మన్‌గా ప్రకటించిన వెంకట్‌రెడ్డి

ఫ ప్రస్తుత చైర్మన్‌పై అవిశ్వాసం కోసం ఇప్పటికే నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు

ఫ కొత్త కలెక్టర్‌ వచ్చాక

అవిశ్వాసం తేదీ ప్రకటించే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement