దేశానికి ఆదర్శంగా నిలవాలి
ఎంజీయూ (నల్లగొండ రూరల్): మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులంతా దేశం ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదగాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో రూ.38 కోట్లతో నిర్మించనున్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, బాలికల హాస్టల్ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో చదువుకున్న సుందర్ పిచాయ్ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. నేడు అన్ని వసతులు అందుబాటులోకి తెచ్చి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నామన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు సాధించడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ప్రతి విద్యార్థి ఎదగాలన్నారు. విద్యార్థినులు కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్‌లో రాణించాలన్నారు. అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. యూనివర్సిటీని తానే నెలకొల్పానని నాటి సీఎం వైఎస్సార్‌ను ఒప్పించి మహాత్మాగాంధీ యూనివర్సిటీని నెలకొల్పామన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా ఒక్క మెసేజ్ పెడితే పరిష్కరిస్తానన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఓయూ, జేఎన్‌టీయూ తరహాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీనీ అభివృద్ధి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్ పైనాన్స్ కోర్సులను ప్రభుత్వం నిర్వహించేలా చూడాలని, సైన్స్‌బ్లాక్‌కు అకడమిక్ భవనం నిర్మించాలని, ఖాళీలు భర్తీని చేయాలని కోరారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే స్థలం ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది బీపీఈడీ, డీపీఈడీ, ఫార్మసీ, లా కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రపంచాన్ని నడిపించేది మహిళలన్నారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అనంతరం ప్రతీక్ ఫౌండేషన్ రూ.10 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. సమావేశంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, రిజిస్ట్రార్ రవి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, ప్రొఫెసర్ అంజిరెడ్డి, ప్రశాంతి, రమేష్, రమణారెడ్డి, అరుణ ప్రియ, రవి, మత్య్సేందర్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల
భర్తీపై కేబినెట్‌లో చర్చిస్తాం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ ఎంజీయూలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment