చకచకా.. సమగ్ర సర్వే!
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో వేగంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలతో పోలిస్తే సర్వేలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 12 మండలాలతో ఉన్న చిన్న జిల్లా అయిన ములుగు మొదటి స్థానంలో ఉండగా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలతో అతి పెద్దజిల్లాగా ఉన్న నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వేపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు మండల ప్రత్యేక అధికారులతో పాటు సూపర్‌వైజర్లతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో సర్వే వేగంగా ఇప్పటికే 55 శాతం పూర్తయింది.
జిల్లాలో 5,03,500 కుటుంబాలు..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇళ్ల గుర్తింపు చేపట్టింది. ఎన్యుమరేటర్లంతా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ పూర్తిచేశారు. 9వ తేదీ నుంచి సమగ్ర సర్వే ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల పరిధిలో 182 వార్డులున్నాయి. వీటిలో మొత్తం 5,03,500 కుటుంబాలను గుర్తించారు. ఇందులో గురువారం నాటికి జిల్లాలో 2,80,249 గృహాల్లో ఎన్యుమరేటర్లు పూర్తి చేశారు.
3,832 మంది ఎన్యుమరేటర్ల ద్వారా..
జిల్లాలో సర్వే కోసం గ్రామ పంచాయతీలో 3,131, పట్టణాల్లో 839 బ్లాక్‌లుగా విభజించారు. 3,832 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. ఒక్కొక్కరు 100 నుంచి 200 ఇళ్ల వరకు సర్వే చేయాల్సి ఉంది. ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ చొప్పున 386 మందిని ఎంపిక చేయగా వారంతా నిత్యం గ్రామాల్లో తిరుగుతూ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు పాఠశాలలో బోధిస్తూ.. ఆ తర్వాతి నుంచి సర్వే చేస్తున్నారు. సెలవు దినాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వేలో నిమగ్నమవుతున్నారు. ఎన్యుమరేటర్లు సర్వే చేసిన రిపోర్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అందుకోసం జిల్లాలో 2,835 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.
ఫ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నల్లగొండ
ఫ ఇప్పటికి 55 శాతం సర్వే పూర్తి
Comments
Please login to add a commentAdd a comment