నేటి నుంచి యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు
ఫ తొలి రోజు భారీ ర్యాలీ, బహిరంగ సభ
ఫ రెండు రోజుల పాటు ప్రతినిధుల సభలు
ఫ ముస్తాబైన నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ ఆవరణ
ఫ హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర 6వ మహాసభలకు ఆ సంఘం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నల్లగొండలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు పట్టణంలోని ప్రధాన కూడళ్లను యూటీఎఫ్ తోరణాలతో అలంకరించారు. అతిథులకు ఆహ్వానాలు పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పట్టణమంతా యూటీఎఫ్ తోరణాలతో ఎరుపెక్కింది.
మొదటి రోజు బహిరంగ సభ
యూటీఎఫ్ ఏర్పడిన తర్వాత రెండోసారి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సభల్లో భాగంగా మొదటి రోజైన శనివారం ఉదయం 9:30 గంటలకు గడియారం సెంటర్ నుంచి 5వేల మందికిపైగా ఉపాధ్యాయులతో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్ వరకు మహిళల కోలాట ప్రదర్శన, కళాకారుల ఆటా పాటలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. లక్ష్మీ గార్డెన్స్ ఆవరణలో యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించిన అనంతరం అక్కడే ఉదయం 10 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు.
సభకు హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే..
ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, ఢిల్లీ యూనివర్సిటీ నాయకురాలు ఐసీ ఘోష్‌తోపాటు కె.శ్రీనివాస్, యూటీఎఫ్ ఆహ్వాన సంఘం చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడి కూడా పాల్గొంటారు. అదే రోజు రాత్రి లక్ష్మీగార్డెన్స్‌లో కవి, గాయకుడు, రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
29, 30 తేదీల్లో ప్రతినిధుల సభలు
అలాగే 29, 30 తేదీల్లో యూటీఎఫ్ ప్రతినిధుల సభలు నిర్వహిస్తారు. రెండో రోజైన ఆదివారం విద్యారంగంలో వచ్చిన మార్పులు, భవిష్యత్‌లో వచ్చే పరిణామాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చివరి రోజు సోమవారం సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటారు.
యాభై ఏళ్లలో రెండోసారి
యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి నల్లగొండలో యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో మొదటిసారి నల్లగొండలో రాష్ట్ర మహాసభలు నిర్వహించాం. తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి ఇప్పుడు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.
– పెరుమాళ్ల వెంకటేశం,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
విజయవంతం చేయాలి
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను శుక్రవారం ఆ సంఘం ఆహ్వాన కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహాసభలు చరిత్రలో నిలబడబోతున్నాయన్నారు. ఈ మహాసభలకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మహాసభల్లో చర్చిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment