టాటా ఏస్ బోల్తా.. 15 మందికి గాయాలు
భువనగిరిటౌన్: టాటా ఏస్ వాహనం బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లాలోని ఐనవోలు జాతరకు టాటా ఏస్ వాహనంలో బయల్దేరారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై టాటా ఏస్ వాహనం ముందు టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్లేష్, లక్ష్మి, బాలమ్మ, శ్రీను, రాజు, సంతోష్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వారి బంధువులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బైక్‌లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్
● రెండు బైక్‌లు స్వాధీనం
గరిడేపల్లి: బైక్‌లు చోరీ చేస్తున్న దొంగను సోమవారం అరెస్ట్ చేసినట్లు గరిడేపల్లి ఎస్‌ఐ నరేష్ తెలిపారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన దండుగుల జాన్ బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా జనవరి 7న కీతవారిగూడెంలోని మీసేవా వద్ద ఒక బైక్, అదేరోజు కోదాడ పట్టణంలో మరో బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వలిగొండ: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన వలిగొండ మండలం ఆరూర్‌లో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరూర్ గ్రామానికి చెందిన మర్రి అంజయ్య వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి అంజయ్య పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం అతడిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ముక్యాల కాలువ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హూజర్‌నగర్ పట్ణణ పరిధిలోని మాధవరేణిగూడెం గ్రామానికి చెందిన ఆకుల లింగయ్య(55) గ్రామ సమీపంలో గల వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కోదాడ నుంచి హుజూర్‌నగర్ వస్తున్న బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు కారింగిల జానకిరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురభి రాంబాబుగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment