మోత్కూరు : గత ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాల్లో కోత విధించి, వక్రీకరించి కొత్త పథకాలుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ పేర్కొనానరు. సోమవారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. త్రిఫ్టు పథకం ఆరు దశాబ్దాల నుంచి ఉందని, అప్పట్లో కార్మికుడు ఆరు పైసలు తన ఖాతాలో జమ చేసేవాడని, కాల గమనంలో పథకం రూపాంతరం చెందిందన్నారు. గతంలో 36 నెలలు ఉన్న చేనేతకు చేయూత పొదుపు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా నిలిపివేసి, ప్రస్తుతం 26 నెలలకు కుదించిందన్నారు. ఇప్పుడు పథకం కొత్తగా ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం చేనేత కార్మికులను మోసం చేయడమేనన్నారు. నేతన్న బీమా పథకాన్ని పేరు మార్చి నేతన్న భద్రతగా మళ్లీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నూలు, నగదు బదిలీ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. సంవత్సరానికి రూ.24 వేలు వచ్చే పథకాన్ని రూ.18వేలకు తగ్గించి చేనేత కార్మికుల పొట్టగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చేనేత అభయహస్తం పథకం గతంలో ఉన్నదేనన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20న కలెక్టరేట్‌ల ఎదుట, ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో నేతన్న గర్జననకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కొత్త పథకాల పేరిట ప్రకటనలు చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్
Comments
Please login to add a commentAdd a comment