బొప్పాయి సాగులో మెళకువలు
ఎరువులు వేసుకునే విధానం
ఒక్కో బొప్పాయి మొక్కకు ఒక ఏడాదికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేపపిండి, లేదా ఆముదం పిండి, అరకిలో యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పెట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను రెండు నెలలకోసారి ఏడాదంతా ఆరుసార్లు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించాలంటే 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌లను వారం వ్యవధిలో 48 వారాల పాటు అందించాలి. తేలికపాటి నేలల్లో జింక్, ధాతు లోపాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. వీటి నివారణకు లీటర్ నీటికి ఒక గ్రాము బోరాక్స్, 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పిచికారీ చేయాలి.
పెద్దవూర: సరైన నీటి వసతి ఉంటే అన్ని కాలాలు బొప్పాయి సాగు అనుకూలమని, బొప్పాయి సాగుతో మంచి ఆదాయం ఆర్జించవచ్చని ఉద్యానవన శాఖ అధికారి మురళి పేర్కొన్నారు. బొప్పాయి సాగు గురించిన సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
● అనుకూలమైన నేలలు : నీటి నిల్వ సారవంతమైన తేలికపాటి నల్లరేగడి నేలలు, ఎర్రగరప నేలలు బొప్పాయి సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నేలలు, చౌడు, ఆమ్ల నేలలు పనికిరావు.
● బొప్పాయి రకాలు : ఏక లింగాశ్రయ, ద్విలింగాశ్రయ జాతి. వీటిలో ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా పూసే మొక్కలు ఉంటాయి. వీటిలో వాషింగ్టన్, సోలో, పూసా డెలీషియస్, పూసా జెయింట్, రైజ్ సోలో, సూర్య, కో–రకంలో 1,2,3,4,5,6,7 అనే రకాలు ఉన్నాయి.
● విత్తనాల ప్రవర్థనం(అభివృద్ధి) : బొప్పాయి పండు నుంచి తీసి ఆరబెట్టిన విత్తనాలను 45 రోజుల్లోగా విత్తుకోవాలి. హైబ్రీడ్ రకాల నుంచి తీసిన విత్తనాలను ప్రవర్థనానికి వినియోగించరాదు.
● విత్తుకునే విధానం : ఎకరానికి 200 గ్రాముల వరకు విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను తగినంత 150 గేజ్ మందం కలిగిన పాలిథిన్ సంచుల్లో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో కలిపి నాటాలి.
● నీటిని అందించే విధానం : మొక్కల మొదళ్ల వద్ద నీరు తగలకుండా, నీరు నిల్వ ఉండకుండా పిల్ల పాదులు తయారు చేసి నీటిని పారించాలి. డ్రిప్ ద్వారా అయితే చిన్న మొక్కలకు రెండ్రోజులకు ఒకసారి ఎనిమిది లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షాకాలంలో అయితే అవసరాన్ని బట్టి నీటి తడులు అందించాలి.
● నాటుకునే విధానం : భూమిని తగినంత తడి ఉన్నప్పుడు 30–40 సెంటీమీటర్ల లోతుగా మెత్తగా దున్నుకోవాలి. మొక్కల మధ్య ఎటుచూసినా 1.8 మీటర్ల దూరం ఉండేలా తగినంత గుంతలు తీసి సిద్ధం చేసుకోవాలి. ప్రతీ గుంతలో 5 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పెరిల్లం, 20 గ్రాముల ఫాస్పో బాక్టీరియా వేసి బాగా కలిపి గుంతలను నింపాలి. అనంతరం 45 నుంచి 60 రోజులు కలిగిన బొప్పాయి మొక్కలను సాయంత్రం పూట మాత్రమే గుంతల్లో నాటుకోవాలి.
● తెగుళ్లు – నివారణ చర్యలు
1. కాండం మొదలు కుళ్లు తెగులు : బొప్పాయి చెట్లకు ఈ తెగులు సోకితే వేర్లు, మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు కాయలు కలిగిన బొప్పాయి చెట్లను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈ తెగులు నివారణకు మొక్కల మొదళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. లీటర్ నీటికి 2 గ్రాములు అలియేట్ కలిపి మొదలు తడపాలి. వారం వ్యవధిలో రెండు నుంచి మూడసార్లు తడపాలి.
2. బూడిద తెగులు : బొప్పాయి ఆకులపై, లేత చిగుళ్లపై కాండంపైన తెల్లటి బూడిదలాంటి శిలీంధ్రం ఏర్పడుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 2 మి.లీ. నీటిని కలిపి పిచికారీ చేయాలి.
3. ఆకుమచ్చ తెగులు : బొప్పాయి ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపురంగుకు మారి ఎండిపోతాయి. వీని నివారణకు క్లోరోథాలోనిన్ 2 గ్రాములు కలిపి పక్షం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
4. కాండం కుళ్లు తెగులు : బొప్పాయి చెట్ల కాండం మొదలు కుళ్లిపోయి జిగురు లాంటి ద్రవం కారుతుంది. దీంతో చెట్లు వాలిపోతాయి. దీని నివారణకు కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రంతో పాటు 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, ఒక కిలో బెల్లం నీటిని 10 రోజుల పాటు మండె కట్టి చెట్ల పాదుల్లో వేసుకోవాలి.
5. ఆకుముడత తెగులు : ఈ తెగులు కారణంగా ఆకులన్నీ ముడుచుకుపోతాయి. కాయల ఆకారం వంకరటింకరగా మారుతాయి. దీంతో సాగుబడి తగ్గిపోతుంది. అంతర్వాహిక కీటక నాశనులను ఉపయోగించి వైరస్ ద్వారా సంభవించు తెగుళ్లను అరికట్టవచ్చు.
6. పండు ఈగ తెగులు : పక్వానికి వచ్చిన కాయలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాయలోని గుజ్జును తినివేయడం వలన కాయలు మెత్తబడి కుళ్లిపోతాయి. దీని నివారణకు బొప్పాయి తోటలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్లకింద పడిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ మిథైల్‌యూజినాల్, 2 గ్రాముల కార్బోప్యూరాన్‌లను కలిపి పొలంలో అక్కడక్కడా వేసుకోవాలి.
● కోత విధానం : బొప్పాయి మొక్కలను నాటిన 9వ నెల నుంచి రెండున్నరేళ్లలో కాపుకు వస్తుంది. ఎకరానికి సుమారు 25 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బాగున్న కాయలను చెట్లపై మాగనీయరాదు. భారీ పరిమాణం గల బొప్పాయి కాయలను కోసి న్యూస్ పేపర్లలో చుట్టి మార్కెట్‌కు తరలించాలి.
Comments
Please login to add a commentAdd a comment