నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి
● చిన్నప్పటి నుంచే సృజనాత్మకత
కలిగి ఉండాలి
● జిల్లాస్థాయి సదరన్ సైన్స్‌ఫేర్‌లో
జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకొని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పాఠశాలలో జిల్లాస్థాయి సదరన్ సైన్స్‌ఫేర్ నిర్వహించారు. ఇక్కడికి 126 సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శనకొచ్చాయి. ఇందులో మూడు విభాగాల నుంచి 6 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. అంతకు ముందు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పట్టకుండా అర్థం చేసుకొని చదవాలన్నారు. అలా విద్యనభ్యసిస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారన్నారు. అలాగే ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనడం అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన, సైన్స్‌ఫేర్ లాంటివాటిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. చాలా మంది ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారని,దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విలువైన సమయాన్ని వృథా చేయకుండా మెదడుకు పదును పెట్టాలన్నారు. ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే అన్నింటా రాణించగలుగుతారన్నారు. తాను విద్యార్థిదశలో చదువుతోపాటు ఆటపాటలు, పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొనడం వల్లే నేడు ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 2వ వారంలో విజయవాడలో జరుగుతాయని జిల్లా సైన్స్‌ఫేర్ కో ఆర్డినేటర్లు సుందర్‌రావు, కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. విద్యావైజ్ఞానిక సదస్సును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ప్రేమంత కుమార్, లలితమ్మ, జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్లు సురేంద్ర, ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ సిద్ధం శివరాం, ఎస్పీజీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవలత, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment