హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం
మిడుతూరు: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందామని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్య నిర్వాహకులు మల్లు వెంకటరెడ్డి అన్నారు. మాసపేట గ్రామం ఆంజనేయస్వామి ఆలయంలో ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గో పూజ, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవరచుకోవడంతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. బాల్యం నుంచి పిల్లలకు ఇతిహాసాలపై ఆసక్తి కల్పించాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు వనజ కుమారి, గ్రామ పెద్దలు వంగూరు రామసుబ్బారెడ్డి, వంగూరు జనార్దన్ రెడ్డి, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమవుతుందని డీఐఈఓ సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో నేడు ఈ పథకాన్ని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరై ప్రారంభిస్తారన్నారు. డ్రాపౌట్ తగ్గించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించారు.
ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం వీడాలి
నంద్యాల: ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాలు, ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీడీ, ఏపీఓలు తమ పనితీరు మార్చుకోవాలన్నారు. లేబర్ బడ్జెట్ కింద వేతన దారులకు వంద రోజులు పని దినాలు కల్పించడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. జిల్లాలో 2.3 లక్షల మంది వేతనదారులు ఉంటే కేవలం 3వేల మందికే వందరోజుల పని దినాలు కల్పించారన్నారు. సమావేశంలో డ్వామా పీడీ జనార్దన్ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతి ఉన్న విత్తనాలే ప్రాసెసింగ్ చేయాలి
నంద్యాల(అర్బన్): వ్యవసాయశాఖ అనుమతి పొందిన కంపెనీల పత్తి విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు. అలాగే ప్రాసెసింగ్ ద్వారా వచ్చే వ్యర్థాలను ఈటీపీ ప్లాంట్ల ద్వారానే శుద్ధి చేయాలన్నారు. పట్టణ శివారులోని నాగ వెంకటేశ్వర సీడ్స్, వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ పత్తి విత్తన శుద్ధి కేంద్రాలను శుక్రవారం ఏడీఏ రాజశేఖర్, ఏఓ ప్రసాదరావులతో కలిసి డీఏఓ ఆకస్మిక తనిఖీ చేశారు. సీడ్ ప్లాంట్ల రిజిస్టర్లను పరిశీలించి, కంపెనీల వారీగా విత్తనాల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోడౌన్‌లలో విత్తన నిల్వల స్టాక్ బోర్డు ఏర్పాటు చేసి అప్‌డేట్ చేయాలన్నారు.
బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,850 మందికి గాను 3,560 మంది హాజరు కాగా 325 మంది ఛాత్రోపాధ్యాయులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 91.60 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment