తుగ్గలి మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
ఉపాధి పనులతో జేబులు నింపుకుంటున్న టీడీపీ నేతలు,కొందరు సిబ్బంది
ఫీల్డ్ అసిస్టెంట్లందరూ తెలుగుదేశం కార్యకర్తలే
కుటుంబానికి అందని 100 రోజుల పని
25 నుంచి 30 శాతం వరకు దొంగ మస్టర్లే
పనుల్లేక ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి లక్ష కుటుంబాలు వలసబాట
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదలకు ‘ఉపాధి’ హామీ ఇవ్వడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాల్సి ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6,843 కుటుంబాలకు మాత్రమే ఆ మేరకు పని కల్పించారు. టీడీపీ నేతలు, కొందరు సిబ్బంది ఇష్టారీతీన వ్యవహరిస్తూ ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా కూలీలు, చిరు రైతులకు ఉన్న ఊర్లోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే , రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అడిగిన వారందరికీ పనులు కల్పించడం లేదు. కొందరు ‘ఉపాధి’ సిబ్బంది కాసుల కోసం జాబ్ కార్డులను సైతం తొలగిస్తున్నారు. స్థానికంగా పనులు లేకపోవడంతో చాలా మంది వలస బాట పడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచే గాకుండా డోన్ నియోజకవర్గం నుంచి సైతం పెద్ద సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్లి పోయాయి. సంక్రాంతి తర్వాత జిల్లా నుంచి మరో లక్ష కుటుంబాలు వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి.
నంద్యాల జిల్లాతో పోలిస్తే కర్నూలు జిల్లాలో కరువు తీవ్రత ఎక్కువ. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో పంటలు పండకపోవడంతో కరువు తిష్ట వేసింది. ఈ మండలాల్లో ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుంది. కానీ వంద రోజుల పని దినాల కల్పన నామమాత్రానికే పరిమితమైంది. నందవరం మండలంలో 9 నెలల్లో కేవలం 12 కుటుంబాలకే వంద రోజుల పని దినాలు కల్పించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రకారం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఏటా లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలి. అయితే కర్నూలు జిల్లాలో 9 నెలల కాలంలో 3,130, నంద్యాల జిల్లాలో 3,713 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించారు.
అంతా నిర్లక్ష్యం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడు లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. 2024–25లో 1.74 కోట్ల పని దినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 99 లక్షలు, నంద్యాల జిల్లాలో 75 లక్షల పని దినాలు కల్పించే విధంగా లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1.22 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో 9 నెలల్లో 64.71 లక్షలు, నంద్యాల జిల్లాలో 57.69 లక్షల పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కూలీలు, సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నప్పటికీ ‘ఉపాధి’ కల్పన అంతంత మాత్రమే. కర్నూలు జిల్లాలో 43,487, నంద్యాల జిల్లాలో 15,465 మందికి పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
బోగస్ మస్టర్లు
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 58,952 మంది కూలీలు పనులకు వస్తున్నట్లు మస్టర్ వేస్తున్నా... ఇందులో 25 నుంచి 30 శాతం బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయిలోని పీల్డ్ అసిస్టెంట్లు, సాంకేతిక సహా యకులు గ్రామస్థాయి టీడీపీ నేతలతో కుమ్మకై ్క బోగస్ మస్టర్లు వేస్తున్నారు. రానున్న రోజుల్లో బోగస్ మస్టర్లు వేయడం ద్వారా అక్రమాలు మరింత భారీగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామ, మండల స్థాయి టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉపాధి పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను సమూలంగా మార్చి టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమాలు ఇవీ..
పని దినాల్లో కూడా సగానికిపైగా కోత పెడుతున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు వరుసగా ఆరు రోజులు పని చేస్తున్నప్పటికీ అనేక మంది ఒకటి, రెండు రోజులకు మాత్రమే వేతనాలు లభిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలకు మిగిలిన రోజుల వేతనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రమ ఒకరిది... ఫలితం మరొకరిదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలు మంత్రాలయం, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉన్నాయి.
● ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు లోపాయికారీ ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం జాబ్‌కార్డులు తొలగిస్తున్నారు. మళ్లీ జాబ్‌కార్డు కావాలంటే ఫీల్డ్ అసిస్టెంటుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది.
● నిర్దిష్ట కొలతల ప్రకారం ఉపాధి పనులు చేస్తే రోజుకు రూ.300 ప్రకారం వేతనం లభించాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు పని ప్రదేశానికి వెళ్లి, మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేసినప్పటికీ లభిస్తున్న వేతనం రూ.100 వరకు మాత్రమే. దొంగ మస్టర్లకు మాత్రం రూ.280 నుంచి రూ.300 వరకు వేతనం లభిస్తోంది. ‘ఉపాధి’ పనుల్లో టీడీపీ నేతల జోక్యం పెరిగిపోవడంతో నిజమైన కూలీలకు తీరని అన్యాయం జరుగుతోంది.
దగా చేస్తున్నారు
మాకు ఉపాధి పనులే ఆధారం. నా భార్యతో కలసి సోమవారం నుంచి శనివారం వరకు వరుసగా ఆరు రోజులు పనిచేస్తే కేవలం ఒక్క రోజుకు, లేదా రెండు రోజులకే వేతనం లభిస్తోంది. డిసెంబరు నెల మొత్తం ఉపాధి పనులకు వెళ్లాం. ఒక్క వారం కూడా చేసిన పని దినాలకు అనుగుణంగా వేతనాలు లభించ లేదు. ఎందుకు ఈ విధంగా కూలీలను దగా చేస్తున్నారనే దానిపై ఎవ్వరూ నోరు విప్పడం లేదు. – అబ్బాసలి, కౌతాళం
ఆదుకోవడం లేదు
మాది అత్యంత వెనుకబడిన మండలం. ఇక్కడ ఉపాధి పనులకు డిమాండ్ ఎక్కువ. కుటుంబం యూనిట్‌గా మాకు జాబ్ కార్డు ఇచ్చారు. వంద రోజులు పని దినాలు పూర్తయ్యాయి. స్థానికంగా ఉపాధి పనులు లేకపోవడంతో తెలంగాణ ప్రాంతానికి కుటుంబంతో సహా వలస వెళ్లాం. క్రిస్మస్ పండుగ కోసం గ్రామానికి వచ్చాను. పనులు ఆదుకోవడం లేదు. మళ్లీ వలస పోవడానికి సిద్ధంగా ఉన్నాం.
– టి. బాబు, పల్లెపాడు, కోసిగి మండలం
చర్యలు తీసుకుంటాం
వారంలో ఆరు రోజులు పని చేస్తే ఒకటి, రెండు రోజులకు మాత్రమే వేతనం లభిస్తుందనే ఫిర్యాదులు నా దృష్టికి రాలేదు. వారంలో ఎన్ని రోజులు పనికి హాజరైతే అన్ని రోజులకు వేతనం ఇవ్వాల్సి ఉంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఉపాధి పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి. మస్టర్ వేయడంలో అక్రమాలకు అవకాశం లేకుండా నిఘా పెంచాం.
– వెంకటరమణయ్య, డ్వామా పీడీ, కర్నూలు
9నెలల్లో 100 రోజులు పనిదినాలు పొందినకుటుంబాలు
మండలం; కుటుంబాలు: నందవరం 12, వెల్దుర్తి 28, కల్లూరు 86, కోడుమూరు 99, హొళగుంద 93, కౌతాళం 88, కొలిమిగుండ్ల 87, ఓర్వకల్లు 99, దొర్నిపాడు 72, మద్దికెర 78, పెద్ద కడుబూరు 28, పగిడ్యాల 43, ఎమ్మిగనూరు 36, కర్నూలు 66, కృష్ణగిరి 25, గోనెగండ్ల 28, డోన్ 69
Comments
Please login to add a commentAdd a comment