టీడీపీ నాయకులు చెదిరించినా బెదరకుండా నామినేషన్ దాఖలు చేస్తున్న రైతులు
పాల కేంద్రం ఎన్నికల నామినేషన్ పత్రాలు చించివేసి హల్‌చల్ చేసిన తెలుగుతమ్ముళ్లు
అధికార పార్టీ అభ్యర్థికి ప్రత్యర్థిగా ఎవరూ నామినేషన్ వేయరాదని దౌర్జన్యం
బెదరకుండా నామినేషన్ వేసిన ఇద్దరు రైతులు
దురుసుగా ప్రవర్తించిన ‘పచ్చ’ మూకలు
పోలీసులు అడ్డుకున్నా బీభత్సం
ఆళ్లగడ్డ: టీడీపీ నాయకులు బరితెగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులతో ప్రశాంత గ్రామాల్లో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా చిన్నవంగళి గ్రామంలో సామరస్యంగా జరగాల్సిన పాలకేంద్రం ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను అధికారుల చేతుల్లోనుంచి లాక్కొని చింపి వేసి హల్ చల్ చేశారు.
పచ్చ మూకలు వ్యవహరించిన తీరుతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే చాగలమర్రి మండలం చిన్నవంగళి గ్రామంలోని పాల కేంద్రం పాలక వర్గానికి సంబంధించిన రెండు డైరెక్టర్ల ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక పాలకేంద్రంలో నామినేషన్లు స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
ముందుగా టీడీపీ వర్గానికి చెందిన ఇద్దరు పాల రైతులు నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత ఇతరులెవరూ నామినేషన్ వేయరాదని, వేస్తే మీ అంతు చూస్తామంటూ అధికార పార్టీ నాయకులు గ్రామ వీధుల్లో తిరుగుతూ హల్‌చల్ చేయడంతో పాటు పాల కేంద్రం వద్దకు ఎవరైనా వస్తే వెంటనే కిడ్నాప్ చేసేలా సమీపంలో అక్కడక్కడా కాపల కూర్చున్నారు.
అయితే, వారికి బెదరకుండా మరో ఇద్దరు పాల రైతులు నామినేషన్ పత్రాలతో పాలకేంద్రంలోకి వెళ్లారు. నిబంధనల మేరకు నామినేషన్ దాఖలు చేసి రసీదు కూడా తీసుకున్నారు. గమనించిన టీడీపీ శ్రేణులు గట్టిగా కేకలు వేస్తూ నామినేషన్ వేసేందుకు వెళ్లిన వారిని బయటకు లాక్కొచ్చేందుకు పాలకేంద్రం వైపు పరుగెత్తారు.
తలుపులు బద్దలు కొట్టి.. నామినేషన్ పత్రాలు చించేసి !
తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులకు ప్రత్యర్థులుగా మరో ఇద్దరు రైతులు నామినేషన్ వేశారని చాగలమర్రిలో ఉన్న ఆ పార్టీ మండల నాయకులకు తెలియడంతో వారు గ్రామానికి హుటాహుటిన వచ్చారు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలతో కలిసి ఈలలు, కేకలు వేస్తూ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం పైకి దూసుకు పోయారు.
పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా రిటర్నింగ్ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడి ఎన్నికల అధికారుల ఫైల్లో ఉన్న నామినేషన్ ధ్రువీకరణ పత్రాలను ముక్కముక్కలుగా చించి వేశారు. ఇదంతా అధికారులు, పోలీసుల ఎదుట జరగడం విశేషం. ఇంత జరిగాక అంతలో మరో ఎన్నికల అధికారి వచ్చి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment