కమనీయం.. గోదాదేవి కల్యాణోత్సవం
ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు.. వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ శ్రీ అహోబిల లక్ష్మీనరసింహుడు, గోదాదేవీ పరిణయ వేడుక సోమవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వైభవంగా జరిగింది. ఈ తంతుతో నెలరోజులుగా జరుగుతున్న ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ముగిశాయి. పూజల్లో భాగంగా వేకువ జామున దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లతో పాటు గోదాదేవిని సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక ధనుర్మాస, భోగి పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వామిని, గోదాదేవికి ఎదురుగా కొలువుంచి వేద పండితులు నవకలశ స్థాపన, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆండాల్ అమ్మవారి సన్నిధికి తోడ్కొని వచ్చి శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. అనంతరం పల్లకీల్లో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment