ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నారసింహుడు.. ఈ మాట వింటేనే భక్తులు పరవశించిపోతారు. ఏటా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని ముడుపులు కడతారు. తమ ఇలవేల్పును ఒక్కసారైనా దర్శించి తరించాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ దర్శన భాగ్యం సామాన్యుడికి దూరం చేసే పరిస్థితిని అహోబిలం దేవస్థానం తీసుకొచ్చింది. 2022లో దేవదాయ శాఖ నుంచి అహోబిలం మఠం ఆధీనంలోకి వెళ్లింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవస్థానంలో తెలుగు తమ్ముళ్ల పెత్తనం శ్రుతి మించింది. అడ్మినిస్ట్రేషన్‌తో పాటు వైదిక కై ంకర్యాలలో సైతం పెత్తనం చెలాయిస్తున్నారు.
ఈ ఉదంతం వెనుక ప్రస్తుత అధికారులు తమ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. శ్రీ అహోబిలేశుడిని దర్శనార్థం శని, ఆదివారాల్లో భక్తులు రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు వస్తుంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో అయితే రోజుకు 20 నుంచి 30 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయితే దేవస్థానం పొలిమేరలో అడుగుపెట్టినప్పటి దోపిడీ మొద లవుతోంది. వాహనాలగేట్, కేశ ఖండన, శీఘ్ర దర్శనం, ప్రసాదం.. ఇలా ఒక్కటేంటి? ప్రతి దాంట్లోనూ అందినకాడికి దోచుకుంటున్నారు.
మొన్నటి వరకు దిగువ అహోబిలంలో మాత్రమే ఉన్న వాహనాల గేటు గత వారం రోజుల నుంచి ఎగువ అహోబిలం వెళ్లే వాహనానికి రూ. 70 వసూలు చేస్తున్నారు. రూ. 10 ఉన్న లడ్డూ ధర రూ. 20కి పెంచారు. తలనీలాలు రూ. 10 నుంచి రూ. 50, పుట్టు వెంట్రుకలు రూ. 20 నుంచి రూ. 100, శీఘ్ర దర్శనం రూ. 50 నుంచి రూ. 100 పెంచారు. ఎవరితోనూ చర్చించకుండా కనీసం పనిచేసే సిబ్బందికి సైతం తెలియకుండాపెంచారు. అయితే పాత ధరలు ఉన్న రసీదులతోనే పెంచిన ధరలు వసూలు చేస్తుండటంపై పలు విమర్శలకు తావిస్తోంది.
తలనీలాల ఆదాయం గోవిందా.. గోవింద!
ఎక్కడైనా దేవస్థానాల్లో వేలం పాటలు నిర్వహించి ఆదాయం పెంచుకోవడం పరిపాటి. అయితే అందుకు విరుద్ధంగా అహోబిలంలో కొనసాగుతోంది. ఏటా రూ. 2.50 కోట్లు ఆదాయం తెచ్చి పెట్టే తలనీలాల వేలం పాట గత ఏడు నెలలుగా నిర్వహించలేదు. దేవస్థానంలో నిల్వ ఉన్న 1000 కిలోల వెంట్రుకలు కిలో రూ. 7 వేలు చొప్పున బేరం కుదిరినా వాటిని అధికార పార్టీ నేతకు భయపడి కిలో రూ. 3 వేలకు ఇవ్వడంతో పాటు తూకం కూడా వారికి ఇష్టమొచ్చినట్లు వేసుకుని ఎత్తుకెళ్లేలా అనుమతిచ్చారు. తలనీలాల విషయంలోనే దేవస్థానానికి సుమారు రూ. 30 నుంచి రూ .40 లక్షల దాక నష్టపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
వీటితో పాటు టెంకాయలు, బొమ్మల అంగళ్లు, కిరాణం, కూల్ డ్రింక్ ఇలా దశాబ్దాలుగా ప్రతి ఏడాది నిర్వహించే వేలం పాటలు నిర్వహించారు. ఈ సారి మాత్రం కేవలం పచ్చ నేతలు చెప్పిందే ధర.. అన్నట్లు సుమారు రూ. 4 నుంచి రూ. 5 కోట్లు వరకు ఆదాయం వచ్చే వేలంపాటలు తమ్ముళ్లకు అప్పనంగా తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇప్పుడు గుడికి ఆదాయం తగ్గుతోందని సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా దర్శనం టిక్కెట్లు, తలనీలాలు, ప్రసాదం ధరలు అమాంతం పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment