దయనీయం.. విద్యాలయం
ధన్వాడ: బండలు పగిలి ఇసుక తేలిన తరగతి గదులు.. కూర్చునేందుకు బెంచీలు లేక నేలపైన ల్యాబ్ పరీక్షలు.. మరమ్మతుకు నోచుకోని తాగునీటి మినరల్ ప్లాంట్.. విరిగిన కిటికీలు.. పనిచేయని ఫ్యాన్లు.. ఇదీ ధన్వాడ మోడల్ స్కూల్ దుస్థితి. మొత్తంగా మోడల్ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలో కనిస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లో ఎక్కడ చూసినా బండలు పగిలి గుంతలు ఏర్పడ్డాయి. తరచూ విద్యార్థులు అటుగా వెళ్తూ గమనించక గాయాలపాలవుతున్నారు. ఇక ల్యాబ్‌లలో కూర్చునేందుకు బెంచీలు లేక నేలపైనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి కోసం మినరల్ ప్లాంట్ ఉన్నా మరమ్మతుకు నోచుకోకపోవడంతో వృథాగా మూలనపడింది. దీంతో విద్యార్థులు బోరు నీటిని తాగాల్సిన పరిస్థితి దాపురించింది. చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. తరగతి గది కిటికీలు విరిగిపోయాయి. ఫ్యాన్లు సైతం మరమ్మతుకు నోచుకోక అలంకార ప్రాయంగా ఉండిపోయాయి. ఇదిలాఉండగా, సమస్యల విషయమై ప్రిన్సిపాల్ ఉమయ్‌ఆష్రాను వివరణ కోరగా.. పాఠశాల మరమ్మతుకు ఎలాంటి నిధులు రాలేదని, నేను కొత్తగా బాధ్యతలు చేప్పట్టానని, పాఠశాల పరిస్థితిపై ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు.
మోడల్ పాఠశాలలో
కనీస వసతులు కరువు
ఇబ్బందుల్లో విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment