పరారీలో ఉన్న దొంగ అరెస్ట్
నారాయణపేట: సినీ ఫక్కీలో దొంగతనాలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కి మహబూబ్‌నగర్ జైలు నుంచి 2018, ఆగష్టు 10న తప్పించుకున్న ఓ దొంగ 2024, డిసెంబర్ 27న మరికల్‌లో పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఊట్కూర్‌కు చెందిన చాపలి భాస్కర్ మక్తల్, ఊట్కూరు, మద్దూరు తదితర ప్రాంతాల్లో రాత్రిళ్లు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండేవాడు. దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. 2018, ఆగష్టు 10న గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా పోలీసులు చికిత్స నిమిత్తం ఎస్కార్ట్ వాహనంలో జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తప్పించుకున్నాడు. కొంతకాలం బెంగళూరులో ఉండి అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి కాటేదాన్ ప్రాంతంలో ఉంటూ కొంతకాలం కూలీ పని చేశాడు. తర్వాత చంపాపేట్ ప్రాంతంలోని సరస్వతినగర్‌కు తన మఖాం మార్చి అక్కడే ఉండేవాడు. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో రెండేళ్లుగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నారాయణపేట, మరికల్, మక్తల్, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొంరాస్‌పేట, పరిగి ప్రాంతాల్లో చాలా దొంగతనాలు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున మరికల్‌లో దొంగతనం చేయడానికి రాగా పోలీసుల వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పట్టుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇతను నారాయణపేట, మరికల్, మక్తల్, కోస్గిలో 13 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. 284 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండి, దొంగతనం చేయడానికి ఉపయోగించే ఇనుప కడ్డీ, బ్యాగును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన మరికల్, నారాయణపేట సీఐలు రాజేందర్‌రెడ్డి, శివశంకర్, మరికల్, నారాయణపేట ఎస్‌ఐలు రాములు, వెంకటేశ్వర్లు, క్రైమ్ సిబ్బంది రవీంద్రనాథ్, తిరుపతిరెడ్డి, లింగమూర్తి, ఆంజనేయులు, రాములును డీఎస్పీ అభినందించి క్యాష్ రివార్డ్ అందజేశారు.
2018లో తప్పించుకుని..
2024లో దొరికాడు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ లింగయ్య
Comments
Please login to add a commentAdd a comment