పెంబి మండలంలో పెద్దపులి
● ‘బుర్కరేగడి’లో ఎద్దును హతమార్చిన బెబ్బులి ● ధ్రువీకరించిన అటవీ అధికారులు ● అప్రమత్తంగా ఉండాలని అటవీ గ్రామాల ప్రజలకు సూచన
పెంబి: మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి పక్షం రోజులుగా జిల్లాలోనే సంచరిస్తోంది. సారంగాపూర్, కుంటాల, నర్సాపూర్(జి) మండలాల్లో సంచరించిన బెబ్బులి.. ఆదివారం రాత్రి చించోలి(బి) సమీపంలో మహబూబ్ గాట్స్‌పై రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. అక్కడి నుంచి తాండ్ర రేంజ్ పరిధిలోని పెంబి మండలంలోకి వచ్చిన పులి.. అంకె గ్రామ పంచాయతీ పరిధిలోని బుర్కరేగడి గ్రామంలో కుమురం గంగాధర్ తన చేనులో కట్టేసిన ఎద్దుపై సోమవారం రాత్రి దాడిచేసి చంపేసింది.
అప్రమత్తంగా ఉండాలి..
ఎద్దును హతమార్చింది పెద్దపులే అని అటవీ అధికారులు ధ్రువీకరించారు. మండలంలో పులి సంచరిస్తున్నందున అటవీ గ్రామాల ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. అడవులను ఆనుకుని ఉన్న రాయదారి, వస్‌పెల్లి, దోందారి, చాకిరేవు, పస్పుల తదితర అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. గేదెలు, మేకలు, ఆవులను కాపరులు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లొద్దన్నారు. మైదాన ప్రాంతాల్లోనే మేపాలని పెంబి ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌రావు సూచించారు. పంటల రక్షణకు విద్యుత్ తీగలు, ఉచ్చులు అమర్చొద్దని పేర్కొన్నారు.
పులి కనిపించింది..
అంకెన గ్రామ సమీపంలోని మైదానంలో గొర్రెలను మేపుతుండగా ఒర్రె ఒడ్డున ఉన్న పొదలోకి పెద్దపులి వచ్చింది. దానిని చూసిన గొర్రెలు భయపడ్డాయి. తన వెంట వచ్చిన కుక్క బెదిరి చెల్లా చెదురయ్యాయి. నేను గమనించి అక్కడి నుంచి పారిపోయాను. సాయంత్రం కష్టం మీద గొర్రెల మందను గ్రామంలోకి తీసుకొచ్చాను.
– గుడిసె రమేశ్, అంకెన గ్రామం
ఖానాపూర్
మండలంలో అప్రమత్తం..
ఖానాపూర్: జిల్లాలో పక్షం రోజులుగా సంచరిస్తున్న పులి.. ఖానాపూర్ డివిజన్‌లోకి వచ్చే అవకాశం ఉండడంతో అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఖానాపూర్ మండలం పాత తర్లపాడ్, ఎక్బాల్‌పూర్, దేవునిగూడెం, గోండుగూడ తదితర గ్రామాల్లో ఖానాపూర్ రేంజ్ అధికారులు, సిబ్బంది పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా పొలాలు, చేల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పొలాలకు విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment