ఈసారీ ‘పది’లమేనా..!
నిర్మల్‌ఖిల్లా: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రెండేళ్లుగా నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం కై వసం చేసుకుంటోంది. ఈసారీ జిల్లా విద్యాశాఖ రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మార్చి 21 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. నేటి నుంచి 60 రోజుల సమయం మాత్రమే ఉండటంతో విద్యార్థులు కూడా సమయసారిణి ప్రకారం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
పూర్తయిన సిలబస్..
జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఆయా గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఇప్పటికే పదో తరగతి సిలబస్ పూర్తయింది. కొన్ని రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కలిగే సందేహాలు నివృత్తి చేస్తూ పునశ్ఛరణ కూడా చేస్తున్నారు. ప్రతీ వారం, నెల ఆయా సబ్జెక్టులలో అన్ని పాఠ్యాంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, సాంఘిక తదితర సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన అభ్యాస కరదీపికలు, మెటీరియల్‌ను కూడా విద్యార్థులకు అందజేశారు. మరికొన్ని పాఠశాలల్లో దాతలు, ఉపాధ్యాయుల చొరవతో స్టడీ మెటీరియల్ సమకూర్చారు..
లక్ష్యం దిశగా ప్రణాళిక...
రెండేళ్లుగా ఫలితాలు ఇచ్చిన ప్రేరణతో ఈ విద్యా సంవత్సరం గత జూన్ నుంచే పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, సులభమైన పద్ధతిలో బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగేలా పూర్తిస్థాయిలో సంసిద్ధులను చేసేందుకు ‘‘లక్ష్య’’ కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరదీపికలు అందజేసింది. వారిలో విషయ నైపుణ్యం మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేందుకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ప్రత్యేక విధులను కేటాయించారు. నిత్యం వారిని పర్యవేక్షిస్తూ విద్య నైపుణ్యాల పెంపొందించేందుకు మార్గనిర్దేశం చేసేలా కార్యాచరణ చేపట్టారు. వీటికి అదనంగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి సందేహాలను తీర్చేలా చర్యలు చేపట్టారు. డీఈవో పి.రామారావు సైతం రోజూవారీ పాఠశాలల సందర్శనలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తగు మార్గనిర్దేశనం చేస్తున్నారు.
రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానం సర్కారు బడుల్లో స్టడీఅవర్స్ హ్యాట్రిక్ కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ
గత రెండు విద్యా సంవత్సరాల పాటు నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడంతో ఈయేడు కూడా జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరం పదోతరగతి వార్షిక పరీక్షలకు 230 ప్రభుత్వ పాఠశాలల్లోని 8,908 మంది విద్యార్థులు హాజరుకాగా 99.05 శాతంతో 8,823 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 184 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న దాదాపు 6వేలమంది విద్యార్థులతో కలిపి మొత్తం 9,277 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా మొదటి స్థానం పొందేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
ప్రణాళికతో ముందుకెళ్తున్నాం
పదోతరగతి ఫలితాల్లో గత రెండు విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఈ స్థానాన్ని పదిలపరుచుకునే లక్ష్యంతోనే తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. విద్యార్థులకు పరీక్షలు అంటే భయాందోళనలు తొలగిపోయేలా సన్నద్ధం చేస్తున్నాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
– పి.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి
‘పది’ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల వివరాలు
పాఠశాల సంఖ్య బాలురు బాలికలు మొత్తం
ప్రభుత్వ, జెడ్పీ 116 2,150 1,704 3,854
ఆశ్రమ,
సంక్షేమ గురుకులాలు 32 702 1,015 1,717
కేజీబీవీలు 18 00 715 715
ప్రైవేటు, ఎయిడెడ్ 69 1,688 1,303 2,991
మొత్తం 235 4,540 4,737 9,277
Comments
Please login to add a commentAdd a comment