మున్సిపాలిటీల్లోకి 68 మంది కొత్త ఉద్యోగులు
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని మున్సిపాలిటీల్లోకి 68 మంది కొత్త ఉద్యోగులు రానున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించనున్నారు. వీరంతా గ్రూప్–4 పరీక్షలో ఎంపికయ్యారు. సోమవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ దిలీప్‌కుమార్‌కు రిపోర్టు చేశారు. వీరికి ఉద్యోగ బాధ్యతలు, విధి విధానాలు తదితర అంశాలపై కమిషనర్ దిలీప్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. 58 మంది మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్‌లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లుగా, మరో 8 మంది జూనియర్ అకౌంటెంట్లుగా జాయిన్ కానున్నారు. అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రం ఇవ్వనున్నట్లు తెలిసింది.
అడవుల
నరికివేత ఆపాలి
● ఎఫ్‌ఆర్వో రాధిక
మోపాల్: అడవుల నరికివేతను ఆపి, సంరక్షణలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ సౌత్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక సూచించారు. సోమవారం ముదక్‌పల్లి సెక్షన్ పరిధిలోని సిర్‌పూర్ గ్రామపంచాయతీలో అడవికి నిప్పు – నివారణా చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రాధిక మాట్లాడుతూ అటవీ ప్రాంతాలకు నిప్పు పెడితే పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చినవారవుతారని అన్నారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణం కలుషితమై ఆక్సిజన్ దొరకడం లేదన్నారు. అనంతరం సిర్‌పూర్ కోటను వారు సందర్శించారు. కోట చరిత్ర, పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సదస్సులో సెక్షన్ ఆఫీసర్ బాసిత్, బీట్ ఆఫీసర్ సంయుక్త, అటవీ సిబ్బంది ఉదయ్, నాయకులు కెతడి నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఆర్‌ఎం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ ఆర్‌ఎంగా జోత్స్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె సంగారెడ్డి నుంచి పదోన్నతిపై వచ్చారు. జోత్స్నకు సిబ్బంది పుష్ప గుచ్ఛం అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోత్స్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఎం) శంకర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఓ) ఎన్ సరస్వతి ఉన్నారు. కార్యాలయంలో ఆర్‌ఎం పరిధిలోని డిపో మేనేజర్లు ఆర్‌ఎం జోత్స్నను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment