బోనస్ ఉత్సాహంతో..
డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్ పంటకు బోనస్ అందుకున్న రైతులు ఉత్సాహంతో యాసంగి సాగుకు సిద్ధ మయ్యారు. జిల్లాకు వలస కూలీల రాకతో ఇప్పటికే పలు మండలాల్లో వరినాట్లు ప్రారంభం కాగా, ముందస్తు నారు పోసిన రైతులు చకచకా నాట్లను పూర్తి చేస్తున్నారు. మిగతా వారు కూడా నాట్లు వేసేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టారు. ట్రాక్టర్లకు ఇనుప చక్రాలను బిగించి భూములను దమ్ము చేస్తున్నారు. ఏ రోజు నాట్లు వేయాలో ముందుగానే కూలీలతో ఒప్పందాలు చేసుకుని, అవసరమయ్యే ఎరువులను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న అన్నదాతలు మళ్లీ సాగు పనుల్లో బిజీగా మారారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌కు 4.19 లక్షల ఎకరా ల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు 36,500 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. నెలాఖరు నాటికి నాట్లు లక్ష ఎకరాలు దాటే అవకాశముంది. ఇటు ఎరువుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు జిల్లాకు దిగుమతి చేసుకుంటోంది. సొసైటీలు, డీలర్ల వద్ద స్టాక్‌ను అందుబాటులో ఉంచి పర్యవేక్షణ చేస్తోంది. ప్రస్తుతం యూరియా 20,600 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,100 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 14,760 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 3,100 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ ‘సాక్షి’కి తెలిపారు.
డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో వరినాట్లు వేస్తున్న కూలీలు
యాసంగి వరిసాగును
ప్రారంభించిన అన్నదాతలు
నాట్లు వేసేందుకు వలస వచ్చిన
ఇతర రాష్ట్రాల కూలీలు
జిల్లాకు వలస కూలీలు..
వరినాట్లు వేసేందుకు జిల్లాకు ఎప్పటిలాగే మహారాష్ట్ర, యూపీ, ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచే కాకుండా నల్గొండ జిల్లా నుంచి కూడా వలస కూలీలు వస్తున్నారు. వారికి మధ్యవర్తులుగా ఉన్న మునీములు గ్రామాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వలస కూలీల్లో మహిళలు కూడా ఉండగా, మగవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ సమయంలో, క్రమ పద్ధతిలో నాట్లు పూర్తి చేయడంలో వీరికి పెట్టింది పేరు. రెండు నెలల పాటు జిల్లాలోనే ఉండి నాట్లు పూర్తి చేసుకుని వెళ్తారు. అయితే ఎనిమిది నుంచి పదిమంది ఉండే కూలీల బృందానికి ఎకరం నాటు వేస్తే రూ.4,500 నుంచి రూ.4,800 వరకు రైతులు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment