ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు
నిజామాబాద్ సిటీ: నగరంలో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వస్త్ర, నగల దుకాణాల ప్రారంభోత్సవాలకు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు పెడుతున్నారు. బల్దియా నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బస్టాండ్ వైపు వచ్చే రోడ్డు అసలే ఇరుకుగా ఉంది. ఈ రోడ్డుకు అడ్డంగా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లెక్సీ రోడ్డుకు దగ్గరలో పెట్టడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో ఇలా నాలుగు ప్రమాదాలు జరిగాయి. అయినా సంబంధిత వ్యక్తులు వాటిని తొలగించడం లేదు. టౌన్‌ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఫ్లెక్సీలు ఒక్క రోజుకు మించి ఉంచకూడదు అన్న నిబంధనలు ఖాతరు చేయడం లేదు.
ప్రమాదకరంగా పీఎంజే జువెల్లర్స్ ఫ్లెక్సీలు
నగరంలోని హైదరాబాద్ రోడ్డులో పీఎంజె జువెల్లెర్స్ ప్రారంభించారు. వారం రోజలకు ముందుగానే నగరంలోని అన్ని చౌరస్తాల్లో పెద్దపెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆ షోరూం పక్కన ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల కనిపించకుండా ఫ్లెక్సీలతో నింపారు. నగరశివారులోని ఖానాపూర్ బైపాస్, కంఠేశ్వర్‌బైపాస్, అర్సపల్లి బైపాస్‌ల వద్ద కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ప్రమాదకరంగా పెట్టారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగినా పోలీసు సిబ్బంది స్పందన లేదు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడుతుండటంతో మున్సిపల్‌కు ఆదాయం రావడం లేదు. మాముళ్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రోడ్డుకు అడ్డంగా పెట్టినా
పట్టించుకోని అధికారులు
మూలమలుపుల వద్ద
ప్రమాదకరంగా ఫ్లెక్సీలు
అనుమతులు ఇవ్వలేదు
నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అనుమతులు ఇవ్వలేదు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు తప్పవు. ఫిర్యాదుచేస్తే వాటిని తొలగిస్తాం. కానీ తగినంత సిబ్బంది లేని కారణంగా జాప్యం జరుగుతోంది. ఫ్లెక్సీలు తొలగిస్తే రాజకీయ ఒత్తిడులు తప్పడం లేదు. – సత్యనారాయణ, టీపీవో
వెంటనే ఫిర్యాదు చేయాలి
నగరంలో ఎలాంటి సమస్యలున్నా వెౌంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారులు స్పందించకుంటే వారిపై చర్యలు తప్పవు. అందరికీ ఒకే న్యాయం ఉంటుంది. నగర అభివృద్ధి సుందరీకరణే మా ధ్యేయం.
– దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment