నేడు జిల్లాకు మంత్రి జూపల్లి రాక
నిజామాబాద్‌అర్బన్: మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదివారం జిల్లాకు రానున్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్‌లపై సమీక్ష నిర్వహిస్తారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని భరోసా సెంటర్, గోల్ హనుమాన్ జోన్ ఆఫీస్ ప్రారంభిస్తారు. వాటర్ డ్రైనేజీ కాలువకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు.
నేడు కోర్టు ఉద్యోగాలకు పరీక్ష
ఖలీల్‌వాడి: నిజామాబాద్ లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో కోర్టులో మూడు రికార్డు అసిస్టెంట్, ఒక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అథారిటీ చైర్‌పర్సన్ సునీత కుంచాల తెలిపారు. నగరంలోని వసుధ స్కూల్‌లో పరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.
తెలుగు వారి ఖ్యాతిని
ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్
● మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు
డిచ్‌పల్లి: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్పవ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా మండలంలోని ధర్మారం(బి) పంచాయతీ ఆవరణలో ఏర్పా టు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్, ఈదర పిచ్చయ్య, రావుల బ్రహ్మానందం, నాయుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు రేషన్ కార్డు అందాలి
బోధన్‌టౌన్: అర్హులందరికీ రేషన్ కార్డు అందాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేను శనివారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతోతో కలిసి ఆయన పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, సిబ్బంది ఉన్నారు.
నూతన చట్టాలపై అవగాహన
ఖలీల్‌వాడి: జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య శనివారం సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాలను నూతన చట్టాల ద్వారా అరికట్టే చర్యల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేశ్వర్, రాజారెడ్డి, బంటు వసంత్, శ్యాంరావు, నిమ్మ దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ ఖాందేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్టు నోటిఫికేషన్ విడుదల
నిజామాబాద్ అర్బన్: అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్, కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్టు సంయుక్తంగా ఎంబీఏలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీనికోసం ఫిబ్రవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ రంజిత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 25లోపు ట్యూషన్ ఫీజు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment