వలస కార్మికులను బంధించి వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికులను బంధించి వసూళ్లు

Published Sun, Jan 19 2025 1:17 AM | Last Updated on Sun, Jan 19 2025 1:17 AM

-

మోర్తాడ్‌(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసగించడమే కాకుండా వలస కార్మికులను తమ వద్ద బందీలుగా చేసుకుని, ఇంటికి పంపించాలంటే మరికొంత డబ్బును బలవంతంగా వసూళ్లు చేసిన ఏజెంట్ల ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లికి చెందిన సాగర్‌, జగిత్యాల్‌ జిల్లా మోహన్‌రావుపేట్‌కు చెందిన అరవింద్‌ దగ్గరి బంధువులు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలని భావించారు. వీరిని గమనించిన మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన ఒక ఏజెంట్‌ థాయ్‌లాండ్‌లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఒక్కో వీసాకు రూ.5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. అక్కడ నెలకు రూ.1.50 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చని ఏజెంట్‌ చెప్పిన మాటలు నమ్మిన సాగర్‌, అరవింద్‌లు రూ.5 లక్షల చొప్పున చెల్లించి గత సంవత్సరం నవంబర్‌లో ముంబై నుంచి బ్యాంకాక్‌ వెళ్లారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్‌ బోర్డర్‌ను దాటించడానికి మరికొద్ది మంది దళారులను ఏజెంట్లే నియమించారు. అక్కడే దళారులు సాగర్‌, అరవింద్‌లను బందీలుగా చేసుకుని అసలు నాటకానికి తెర లేపారు. బాధితుల నుంచి మొబైల్‌ ఫోన్‌లను లాక్కుని ఇంటికి మాట్లాడకుండా చేశారు. కొన్ని రోజుల తర్వాత థాయ్‌లాండ్‌లో తమవారు కనిపించకుండా పోయార ని సాగర్‌, అరవింద్‌ల కుటుంబ సభ్యులు డిసెంబర్‌లో ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతోనే ఏజెంట్ల మోసం బయటపడింది.

ఏజెంట్‌ అరెస్టుతో బందీల ఆచూకీ..

ప్రవాసీ ప్రజావాణి గ్రీవెన్స్‌ సెల్‌ ప్రత్యేకాధికారి దివ్యాదేవరాజన్‌ స్పందించి వుమెన్స్‌ సేఫ్టీ వింగ్‌ అధికారిణి షికా గోయెల్‌కు సాగర్‌, అరవింద్‌ల సమస్యను వివరించడంతో పోలీసుల్లో చలనం వచ్చింది. ఆత్మకూర్‌కు చెందిన ఏజెంట్‌ సమ్మెట రాజును మోర్తాడ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్‌ తన అరెస్టు సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని మరో ఏజెంట్‌కు వెళ్లడించడంతో అతను అక్కడ బందీలుగా ఉన్న సాగర్‌, అరవింద్‌లతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో మాట్లాడించడం మొదలు పెట్టారు. ఒక రోజు ఫోన్‌లో మాట్లాడించడానికి మన కరెన్సీలో రూ.1,500 నుంచి రూ.2 వేలు పంపించాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. అలా దళారులు బాధిత కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు లాగడం మొదలు పెట్టి చివరకు తమ చెరలో ఉన్న వారిని ఇంటికి పంపించాలంటే రూ.2 లక్షల చొప్పున తాము సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. తమవారు క్షేమంగా ఇంటికి వస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇటీవల రూ.4 లక్షలు చెల్లించడంతో సాగర్‌, అరవింద్‌లు వారం రోజుల కింద ఇంటికి చేరుకున్నారు.

థాయ్‌లాండ్‌లో ఉపాధి

కల్పిస్తామని ఏజెంట్ల మోసం

ఇరు కుటుంబాలకు

రూ.7 లక్షల చొప్పున నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement