వడ్డీ ఆశచూపి.. డిపాజిట్లు ముంచేసి..
ఖలీల్‌వాడి: అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేస్తున్న చైన్ సిస్టం కంపెనీపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. తమిళనాడులోని తిరుచ్చి కేంద్రంగా నిర్వహిస్తున్న మెడిలైఫ్ కంపెనీ వారు జిల్లాలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లపై వారానికి నాలుగు శాతం వడ్డీ చొప్పున 52 వారాలు చెల్లిస్తామని నమ్మించారు. ఇతరులను జాయిన్ చేస్తే కమీషన్ కూడా ఇస్తామని చెప్పారు. మినీమం రూ.10 వేలు డిపాజిట్ చేయించుకున్నా రు. దీంతో వారి మాటలను నమ్మిన వారు చాలా మంది కంపెనీలో డిపాజిట్ చేశారు. జిల్లాలో దాదాపు 400 మంది రూ.3 కోట్ల వరకు డిపాజిట్ చేశారు. కొంతకాలం వరకు వడ్డీ చెల్లించిన కంపెనీ తర్వాత మానేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. కంపెనీ పేమెంట్స్, అకౌంట్లకు సంబంధించిన సమాచారం సేకరించి నిజామాబాద్‌కు చెందిన మెడిలైఫ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాగర్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ సగయ రాజ్‌కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్, ఇంకా బాధ్యులైన ఇతరులపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ చైన్ సిస్టంలో చాలా మంది బాధితులు ఉండే అవకాశం ఉందని ఏసీపీ తెలిపారు. ప్రజలు ఇలాంటి కంపెనీలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఆర్‌బీఐ గుర్తించిన బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలన్నారు.
రూ. 3 కోట్ల వరకు ఎగ్గొట్టారు..
మెడిలైఫ్ కంపెనీ ప్రతినిధి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment