ప్రాచీన కళకు పునర్ వైభవం | - | Sakshi
Sakshi News home page

ప్రాచీన కళకు పునర్ వైభవం

Published Thu, Oct 24 2024 1:54 AM | Last Updated on Thu, Oct 24 2024 12:28 PM

మెటల్ తో తయారు చేసిన వివిధ డిజైన్ల బ్లాక్ లు

మెటల్ తో తయారు చేసిన వివిధ డిజైన్ల బ్లాక్ లు

కలంకారీ పరిశ్రమకు మెటల్‌ బ్లాక్‌లతో జీవం 

కలంకారీ వస్త్రాల డిజైన్‌ల ముద్రణకు మూలాధారం బ్లాక్‌లు 

వందల ఏళ్ల నాటి మెటల్‌ బ్లాక్‌లు కాలక్రమేణా కనుమరుగు

సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ రూపుదిద్దుకుంటున్న వైనం

కలంకారీ కళ మన దేశంలో శతాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొంది పాశ్చాత్యుల ప్రశంసలు సైతం పొందింది. సహజమైన రంగులతో వస్త్రాలపై అద్భుతమైన డిజైన్లు ముద్రించి ప్రజల మన్ననలు చూరగొంటోంది. ప్రాచీనమైన ఈ కళ అంతరించిపోకుండా పెడన కలంకారీ కార్మికులు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కళలో ప్రధానమైనవి బ్లాక్‌లు. వీటిని వందేళ్ల కిందట మెటల్‌తో తయారుచేసేవారు. ప్రస్తుతం చెక్కతో మాత్రమే చేస్తున్నారు. అయితే పెడనకు చెందిన కలంకారీ పరిశ్రమ యజమాని, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు ప్రాచీన పద్ధతి అయిన మెటల్‌ బ్లాక్‌లను తిరిగి రూపొందించి ఆ కళకు పునర్‌ వైభవం కల్పిస్తున్నారు.

పెడన: కృష్ణాజిల్లాలోని పెడన కలంకారీ కళకు ప్రసిద్ధి. అటువంటి కలంకారీ వస్త్రాలపై డిజైన్‌లను ముద్రించడంలో బ్లాక్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ బ్లాక్‌లు వందల సంవత్సరాల కిందట మెటల్‌తో రూపొందించేవారు. వాటిని తయారు చేయడానికి ఎంతో శ్రమ, సమయం, భారం, ఖర్చు అధికం కావడంతో తదనంతర కాలంలో వాటి స్థానంలో చెక్కతో బ్లాక్‌లు తయారు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మెటల్‌బ్లాక్‌లు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. పూర్వకాలం నాటి మెటల్‌ బ్లాక్‌లను కోరమండల్‌ కలంకారీ పరిశ్రమ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరుస్తూ వచ్చారు. మ్యూజియం సందర్శించిన వారంతా వాటిని చూస్తూ ఆశ్చర్యపోతుండేవారు. 

అలనాటి కళను బతికించాలనే తపన, సాహసంతో వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు మెటల్‌ బ్లాక్‌లను తిరిగి రూపొందించాలని అడుగులు ముందుకు వేశారు. ఎప్పుడో వందేళ్ల కిందట రూపొందించిన మెటల్‌తో రూపొందించిన చింట్జ్‌ డిజైన్‌లతో మెటల్‌ బ్లాక్‌లను రూపొందించడం ఆరంభించారు. అప్పట్లో ఎటువంటి పనిముట్లు వినియోగించారో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని మెటల్‌ బ్లాక్‌లు తయారు చేయడానికి ఆరు నెలల కిందట శ్రీకారం చుట్టారు.

అందుకు అవసరమయ్యే పనిముట్లను సేకరించి రాగి, ఇత్తడి ఉపయోగించి బ్లాక్‌లను తయారు చేయడం ప్రారంభించారు. చెక్కపై పెన్సిల్‌తో డిజైన్‌ గీసి దానిపై మెటల్‌తో డిజైన్‌లను రూపొందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 24 డిజైన్లను 24 మెటల్‌ బ్లాక్‌లను సిద్ధం చేశారు. ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మెటల్‌ బ్లాక్‌ డిజైన్లతో కలంకారీ వస్త్రాలపై ముద్రణలు కూడా వేస్తుండటం విశేషం. ఈ డిజైన్లు ఎక్కువగా మహిళల చీరలు, డ్రస్‌ మెటీరియల్స్‌కు వినియోగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement