గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27.5 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. భవానీపురం పోలీసు స్టేషన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ ఎం.రాజారావు వెల్లడించారు. ఈనెల 12న భవానీపురం సభాపతి రోడ్డుకు చెందిన ఓ మహిళ ఉదయం ప్రసన్న కాళీ గుడికి బయలుదేరింది. స్వాతి సెంటర్ శ్రీలక్ష్మి టిఫిన్ బండి పక్క వీధిలోకి వచ్చే సరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో నానుతాడు లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వెంకటేశ్వర ఫౌండ్రీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి బైక్ వెనుకకు తిప్పుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని హైదరాబాద్‌కు చెందిన సిగడం కుమార్, అమలాపురానికి చెందిన యాలాంగి కృష్ణగా గుర్తించారు. వీరిద్దరు పాత నేరస్తులని, వీరిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దొంగిలించిన బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తూ పట్టుబడ్డారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment