ప్రభుత్వం, ఏపీఓఏ సమన్వయ లోపం–క్రీడాకారులకు శాపం
విజయవాడ స్పోర్ట్స్: ఉత్తరాఖండ్ వేదికగా జరిగే జాతీయ క్రీడల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 15 రోజుల క్రితం మొదలైన కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘ (ఏపీవోఏ) ప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఏపీ రచ్చ ఢిల్లీకి చేరింది. ఈ నెల 26నుంచి ఉత్తరాఖండ్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు అర్హత సాధించిన 18 రాష్ట్ర జట్లు ఈ నెల 13లోగా ఎంట్రీలను పంపాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం–ఏపీవోఏ మధ్య సఖ్యత కొరవడటంతో క్రీడాకారులు నలిగిపోతున్నారు.
ఆరు క్రీడలకు నో ఎంట్రీ
బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డీ, అథ్లెటిక్స్, జూడో, ఖోఖో జట్లకు ఎంట్రీలు దక్కలేదు. ఐవోఏ వెబ్ సైట్‌లో ఆన్‌లైన్ ఎంట్రీల పోర్టల్ క్లోజ్ కావడంతో ఆయా సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుని, సమాఖ్యల నుంచి నేరుగా ఎంట్రీలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారిక ఏపీవోఏ సంఘం ఏదనేది తెలియక.. ఏపీవోఏ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి ఎంట్రీలకు సంబంధించి అధికారిక సమాచారం అందకపోవడంతో ఎంట్రీలు తీసుకోలేకపోయామని ఆయా సంఘాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రీడలకు కఠోర శిక్షణ తీసుకున్న వంద మంది క్రీడాకారులు జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయే పరిస్థితి దాపురించింది.
జాతీయ క్రీడలకు వెళ్లే రాష్ట్ర జట్లకు ఆదిలోనే హంసపాదు బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డీ, అథ్లెటిక్స్, జూడో, ఖోఖో జట్లకు దక్కని ఎంట్రీ రాష్ట్ర ప్రభుత్వం–ఏపీవోఏ మధ్య నలిగిపోతున్న క్రీడాకారులు
2022లో గుజరాత్, 2023లో గోవాలో జరిగిన జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర జట్లకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం టీఏ, డీఏ, ట్రాక్‌సూట్, కోచింగ్ క్యాంప్‌లకు నగదు అంద జేసింది. గోవా జాతీయ క్రీడలకు వెళ్లే జట్లకు రూ.32.48 లక్షలను ఖర్చు చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్రీడాకారులను పట్టించుకోవడం లేదు. జాతీయ క్రీడల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని క్రీడాకారులు, క్రీడాభిమానులు తప్పుపడుతున్నారు. ఆంధ్రా క్రికెట్ సంఘాన్ని చేజిక్కించుకున్న మాదిరిగానే ఏపీవోఏని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జరిగే జాతీయ క్రీడలకు సహాయ, సహకారాలు అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment