జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గణతంత్ర దిన వేడుకల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు వివరించారు. 76వ గణతంత్ర దిన వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ పి.రాజశేఖర్ బాబు ఏర్పాట్ల గురించి సీఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి గణతంత్ర దిన వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదికను ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించి, స్టేడియంలో పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకు ప్రత్యేక ప్రాక్సిమేట్ పార్కింగ్, వేడుకల రిహార్సల్స్, ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌తో పరేడ్‌ను సిద్ధం చేస్తామన్నారు. వేడుకల్లో ఆర్మీ కంటెంజెంట్, రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్, ఎన్‌సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటాయన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment