దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా వేట్లపాలెంకు చెందిన అమతం శైలేంద్రనాథ్, పద్మావతిల కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ డీఈవో రత్నరాజును కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈవో రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
పెనుగంచిప్రోలు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి మాచర్ల సుహాసిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో కాన్పుల నిర్వహణ, ప్రణాళిక పట్టిక, ల్యాబ్ నిర్వహణ, మందులు అందుబాటు, ఎన్‌సీడీ–సీడీ ప్రగతి, పర్యవేక్షణ తదితర అంశాలను సమీక్షించటంతో పాటు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ స్నేహసమీర, వైద్యాధికారి పి.ఇందిర, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో న్యూరో ఆల్ట్రాసోనోగ్రామ్ పరికరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రక్తనాళాల ధోరణి పరిశీలన, లోతైన ట్యూమర్లను గుర్తించే న్యూరో ఆల్ట్రాసోనోగ్రామ్ పరికరాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు. న్యూరోసర్జరీ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ పరికరాన్ని గురువారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జిశ్యామ్‌కుమార్ మాట్లాడుతూ అన్యూరిజమ్ స్థానాన్ని గుర్తించడం, తల, మెడలోని ధమనులలో రక్త ప్రసరణ దోషాలను ఆపరేషన్ సమయంలో గుర్తించడం వంటి వాటిలో ఈ పరికరం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సొంగా వినయ్‌కుమార్, ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి, న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇగ్నో కో ఆర్డినేటర్‌గా
వెంకటేశ్వరరావు
వన్‌టౌన్( విజయవాడపశ్చిమ): కేబీఎన్ కళాశాల ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఇగ్నో ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ జారీ చేసిన ఉత్తర్వులను ఇగ్నో ప్రాంతీయ కేంద్రం విజయవాడ సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ కోఆర్డినేటర్‌గా నియమితులైన ఎం.వెంకటేశ్వరరావుకు గురువారం అందజేశారు. నూతన కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ తగిన సేవలను సకాలంలో అందజేస్తామన్నారు. ఉన్నత విద్యకు దూరంగా ఉన్న వారికి దూరవిద్య ద్వారా చేరువ చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావు నియామకం పట్ల కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు, ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్‌బాబు తదితరులు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment