పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం
చిలకలపూడి(మచిలీపట్నం): బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టబోయే పనులపై కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో గురువారం ఆయన సమీక్షించారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ ప్రాంతంలో రానున్న పరిశ్రమలు, వాటి వల్ల లభించే ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిలకలదిండి ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని, అందుకు గల అవకాశాలు పరిశీలించాలన్నారు. ఇందుకోసం అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించటానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఇందులో చేతి వృత్తుల వారి జీవనోపాధి పెంపొందించటానికి అవసరమైన శిక్షణ, యూనిట్ల స్థాపన వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు. పోర్టు రానున్న నేపథ్యంలో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా, వారికి క్లస్టర్ అభివృద్ధి చేసి పడవల తయారీ యూనిట్ల ఏర్పాటు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూడవచ్చునన్నారు. మంగినపూడి బీచ్ పర్యాటక ప్రాంతం అభివృద్ధి పరిచేందుకు, తాగునీటి అవసరాల కోసం డి–సాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు, వాష్‌రూమ్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బందరు కోటలో పురాతన కట్టడాలను పరిరక్షించి హెరిటేజ్ పార్క్‌గా అభివృద్ధి చేయటానికి గల అవకాశాలు పరిశీలించాలన్నారు. నగరంలో పార్కుల సుందరీకరణ, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో 10 డివిజన్లకు ఒక్కొక్క జిల్లా అధికారిని శానిటేషన్ పర్యవేక్షణకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో బందరు ఆర్డీవో కె.స్వాతి, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment