ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలను నివారిద్దాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా మాసోత్సవాలను గురువారం ప్రారంభించారు. పోస్టర్లు, కర పత్రాలు, బుక్‌లెట్స్, బ్యానర్లను నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు, డీటీసీ ఎ.మోహన్‌లతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చి దిద్దాలని, రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల పట్ల ప్రజలలో పూర్తి అవగాహన కల్పించేందుకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ (ఐఏఆర్‌డీ) యాప్ ద్వారా రవాణా, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తదితర భాగస్వామ్య పక్షాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరైన విధంగా నమోదు చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రహదారి భద్రతపై యువత, ఎన్‌జీవోలతో వినూత్న జాగృతి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఎ.మోహన్ మాట్లాడుతూ మాసోత్సవాల్లో భాగంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, కె.శివరాం గౌడ్, ఉదయ్, శివప్రసాద్, డీవీ రమణ, ఎన్‌ఏఎస్ వర్మ, కేడీవీ రవికుమార్, బి.శ్రావణి, సత్యన్నారాయణ, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ జె.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment