అటపడా గ్రామంలో చెల్లాచెదురైన ధాన్యం బస్తాలు
● ఆటోపై దాడిచేసిన ఏనుగులు ● ఆటో డ్రైవర్ మృతి ● అడపడా గ్రామంలో విధ్వంసం సృష్టించిన వైనం
బరంపురం: గంజాం జిల్లా దిగపండి అటవీ రేంజ్ సన్నొఖేముండి బ్లాక్ పరిధి హడపడా గ్రామంలో మంగళవారం ఏనుగులు సృష్టించిన భీభత్సంలో ఆటో డ్రైవర్ రఘునాథ్ మల్లిక్(40) ప్రాణాలు కోల్పోయాడు. అటవీ అధికారులు, బాధిత గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. హడపడా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రఘునాథ్ మల్లిక్ తన ఆటోలో పాసింజర్లను ఎక్కించుకొని గ్రామ ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఏనుగులు గుంపు వచ్చి వీరిపై దాడికి దిగాయి. దీంతో ఆటోలో ఉన్నవారు పరుగులు తీశారు. అయితే పరుగులు తీస్తున్న ఆటో డ్రైవర్‌ను తల్లి ఏనుగు నేలకేసి కొట్టింది. అనంతరం ఏనుగులు గుంపు తరలిపోవడంతో తీవ్రగాయాలు పాలైన రఘునాథ్ మల్లిక్‌ను అదే ఆటోలో సన్నొఖేముండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఎంకేసీజీలో చికిత్స పొందుతూ రఘునాథ్ మల్లిక్ మృతి చెందాడు.
ధాన్యం బస్తాలు ధ్వంసం
అదేరోజు రాత్రి దగ్గరలో ఉన్నటువంటి లకాడి పర్వతాల్లో సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు అడపడా గ్రామంలోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. గ్రామ శివారులో కల్లాల్లో ఉంచిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న దిగపండి అటవీ రేంజ్ అధికారుల బృందం గ్రామానికి చేరుకొని ఏనుగుల గుంపుని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. కాగా జరిగిన ఘటనపై చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలకు అనుగుణంగా ధాన్యం బస్తాలకు, ఆటో డ్రైవర్ రఘునాథ్ మల్లిక్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment