యువకుడి కిడ్నాప్ కేసులో ఆరుగురు అరెస్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో ఆరుగురు నిందితులను బొరిగుమ్మ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక బొలేరో, రెండు బైక్‌లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బొరిగుమ్మ అడిషినల్ ఎస్పీ మనోజ్ కుమార్ పూజారి శనివారం విలేకరులకు తెలిపారు. అరెస్టయిన నిందితులు బొరిగుమ్మ ఖెందుగుడ గ్రామం జగదీష్ పాత్రో, రతన్ భూమియ, రామ హరిజన్, జగబందు హరిజన్, శాంతినగర్ వాసి పద్మణ పూజారి,జయంతిగిరి గ్రామానికి చెందిన చంద్రహరిజన్ అని వెల్లడించారు. గత శనివారం సాయంత్రం బొరిగుమ్మ సమితి ఖెందుగుడ గ్రామం వాసి డొంబు భూమియ తన గ్రామ సమీపంలో ఉన్న సమయంలో దుండగులు ఒక కారులో వచ్చి అతడిని ఎత్తుకుపోయిన విషయం విదితమే. వారు కారులో అతడిని ఎత్తుకు పోయి జయపురం తీసుకువెళ్లారని, అక్కడ బ్యాంక్‌లో గల డొంబు అకౌంట్ నుంయి రూ.35 వేలు డ్రా చేశారని పోలీసు అధికారి వెల్లడించారు. అనంతరం బొయిపరిగుడ సమితి రామగిరి, దండాబడి ప్రాంతాల నుంచి డొంబు భార్యకు వివిధ నంబర్ల ద్వారా ఫోన్ చేసి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీసులు దుండగుల మొబైల్ ఫోన్‌లను ట్రాప్ చేసి డొంబుకు రొణగుడ గ్రామ సమీపంలో రక్షించారు. ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశామని వెల్లడిస్తూ ఇంకా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. సమావేశంలో బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కుహార్, బొరిగుమ్మ పోలీసు అధికారి యుగల్ కిశోర్ షా, ఎస్‌ఐ చరిత మడకామి ద్రోణాచార్యబాగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment