పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టకున్నారు. బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ శనివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక ట్రక్కులో బొయిపరిగుడ సమితి దశమంతపూర్ నుంచి బొయిపరిగుడ మార్గంలో గంజాయి తీసుకు వెళ్తున్నారన్న సమాచారం పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ కు అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారి వెంటనే సబ్‌ఇన్‌స్పెక్టర్ డి.బారిక్‌ను వెంటనే వెళ్లమని ఆదేశించగా ఆయన పోలీసులతో బొయిపరిగుడ, దసమంతపూర్ మార్గంలో కుర్లగడ్డ కూడలి వద్ద మాటు వేశారు. ఒక అశోక్ లేలాండ్ తెల్లని రంగు ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి దొరికింది. మొత్తం 273 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వాహనంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేశామని వెల్లడించారు. వారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఫిరోజాబాద్ జిల్లా జైగోపాల్ మకరందపూర్ గ్రామానికి చెందిన మందీప్ కుమార్, దీపక్ కుమార్‌లని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment